భద్రాచలంలో కమనీయంగా సీతారాముల కల్యాణం… పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

V. Sai Krishna Reddy
2 Min Read

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేలాది భక్తుల సమక్షంలో సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా హాజరై సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి దంపతులకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించారు. సీతారాముల కల్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల జయజయధ్వానాలతో మారుమోగింది.

కాగా, భద్రాచలంలోని మిథిలా మైదానంలో సీతారాముల కల్యాణ వేడుకకు వేదికగా నిలిచింది. అభిజిత్ లగ్నంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ మెడలో మాంగల్యధారణ చేశారు. ఈ వేడుకకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు.

ఈ కళ్యాణ మహోత్సవానికి హాజరైన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు అన్నదానం, తాగునీరు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఉదయం 9 గంటలకు కల్యాణ క్రతువు ప్రారంభం కాగా, 10 గంటల సమయంలో సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా మిథిలా కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. కల్యాణానికి మూడు నెలల ముందే గోటితో ఒలిచిన తలంబ్రాలను దేవాలయ నిర్వాహకులు సిద్ధం చేశారు. సీతమ్మకు ధరింపజేసే మంగళసూత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మూడు పోగులు కలిగిన ఈ మంగళసూత్రంలో ఒకటి సీతమ్మ పుట్టింటి వారిది కాగా, మరొకటి అత్తగారింటి వారిది. మూడవ పోగును భక్త రామదాసు తయారు చేయించారు.

కల్యాణ ముహూర్త సమయం 12.02 నిమిషాలకు వేద పండితులు వేద మంత్రాల నడుమ జీలకర్ర బెల్లంను అద్దారు. ఆ తరువాత మాంగల్యధారణ మహోత్సవం కన్నుల పండుగలా జరిగింది. భక్తుల రామ నామ స్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. సీతారాముల కల్యాణ ఘట్టం 12.40 నిమిషాలకు వైభవంగా ముగిసింది. ఈ వేడుకను చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేసవి వేడిని సైతం లెక్కచేయకుండా భక్తులు తరలిరావడం విశేషం.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, సీతారాముల ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం తరపున ఆలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

అటు, ప్రతి సంవత్సరము టీటీడీ తరుపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయతీగా వస్తుంది. ఈ సందర్భంగా ముందుగా భద్రాచలం ఆలయం వద్దకు సతీసమేతంగా చేరుకున్న టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి ఆలయ సాంప్రదాయాలతో స్వాగతం పలికారు. పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం టీటీడీ ఛైర్మన్ దంపతులు సీతారాముల కల్యాణంలో పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *