శ్రీరాముని కల్యాణోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చలువ పందిళ్లు ఏర్పాటుచేశారు. వేసవి కావడంతో భక్తులకు మంచినీరు, మజ్జిగ అందించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తూ గోటి తలంబ్రాలను సమర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే.. జంగారెడ్డిగూడెం నుంచి సుమారు ఏడు వేల మంది భక్తులు గోటి తలంబ్రాలు భద్రాద్రి ఆలయానికి సమర్పించారు. దాంతో.. భద్రాచలం రాములోరి ఆలయ పరిసరాలు ఒకరోజు ముందే రామ నామస్మరణతో మారుమోగిపోయాయి.
ఈ వేడుకలకు సీఎం, మంత్రులు, ఇతర ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలి రానున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం రేవంత్రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న నేపథ్యంలో భద్రాచలంలో 2 వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో శ్రీరామనవమి కాగా.. గతేడాది లోక్సభ ఎన్నికల కోడ్ కారణంగా రాములవారి కల్యాణానికి రేవంత్ హాజరు కాలేకపోయారు. అలాగే ఈ రాములోరి కళ్యాణ వేడుకకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు రానుండటంతో భద్రాద్రిలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు.