27 వేల మంది భక్తులు వీక్షించేలా శ్రీనివాస కల్యాణోత్సవ ఏర్పాట్లు: టీటీడీ ఈవో శ్యామలరావు

V. Sai Krishna Reddy
2 Min Read

ఏపీ రాజధాని ప్రాంతం అమరావతి పరిధిలోని వెంకటపాలెంలో ఈ రోజు (15వ తేదీ) సాయంత్రం జరుగనున్న శ్రీనివాస కల్యాణోత్సవాన్ని 27వేల మంది భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఈవో జె. శ్యామలరావు వెల్లడించారు. నిన్న ఆలయం ముందు ఉన్న క్యాంపు కార్యాలయంలో టీటీడీ అధికారులు, జిల్లా అధికారులతో కల్యాణోత్సవ ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. శనివారం సాయంత్రం జరుగనున్న శ్రీనివాస కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని ఈవో వెల్లడించారు.

సీఆర్డీఏ పరిధిలోని 24 గ్రామాల ప్రజలు వెంకటపాలెం చేరేందుకు వీలుగా టీటీడీ దాదాపు 300 బస్సులను ఏర్పాటు చేసిందని ఈవో తెలిపారు. తుళ్లూరు, తాడేపల్లి, తాడికొండ, మంగళగిరి మండలాల ప్రజలు సులువుగా కల్యాణ వేదిక ప్రాంగణానికి చేరుకునేందుకు వీలుగా బస్సులను ఏర్పాటు చేశామన్నారు. అదే విధంగా విజయవాడ నుండి అమరావతికి బస్సు సౌకర్యం బాగా ఉన్న నేపథ్యంలో మందడం నుండి ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సును ఏర్పాటు చేశామని, తద్వారా మందడం నుండి కల్యాణ వేదిక ప్రాంగణానికి చేరుకునేందుకు బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందని ఈవో తెలిపారు.

శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం, పరిసర ప్రాంతాల్లో పుష్పాలంకరణ చేసేందుకు వేగంగా పనులు జరిగాయి. దాదాపు 4 టన్నుల ఫ్లవర్స్, 30 వేల క్లట్ ఫ్లవర్స్, ఆలయంలో మామిడి, అరటి, టెంకాయ తోరణాలతో అలంకరించనున్నారు. శ్రీవారి కల్యాణానికి పూలమాలలు టీటీడీ గార్డెన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం 4 గం.ల నుండి 5 గం.ల వరకు చెన్నైకి చెందిన నిత్యశ్రీ మహదేవన్ గ్రూప్ ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమాలు జరగనున్నాయి. సాయంత్రం 5 గం.ల నుండి 6.15 గం.ల వరకు చెన్నైకి చెందిన ప్రియా సిస్టర్స్ అన్నమాచార్య సంకీర్తనలను ఆలపిస్తారు.

శ్రీనివాస కల్యాణోత్సవానికి వచ్చే భక్తులకు శ్రీవారి లడ్డు, పసుపు, కుంకుమ ప్యాకెట్, పసుపు దారం, కంకణాలు, శ్రీవారి పుస్తక ప్రసాదం, కల్యాణోత్సవం అక్షింతలు కలిపి ఒక బ్యాగ్ లో పంపిణీ చేయనున్నారు. శ్రీనివాస కల్యాణ వేదిక ప్రాంగణం ప్రాంతంలో 5 వేల ఫ్లడ్ లైట్లు, 25 జనరేటర్లు, 18 ఎల్ఈడీ స్క్రీన్‌లు, దశావతారాలు, శ్రీవేంకటేశ్వరుడు, శ్రీ పద్మావతీ అమ్మవార్ల కటౌట్లు, ఆలయం పరిసరాలలో 60 తోరణాలతో పాటు శ్రీవేంకటేశ్వర ఆలయంలో విద్యుత్ అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *