భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మహ్మద్ చేసిన బాడీ షేమింగ్ వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. అతను లావుగా ఉంటాడని, బరువు తగ్గాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. అంతటితో ఆగకుండా అతడి ప్రదర్శన ఏమాత్రం ఆకట్టుకునేలా ఉండదని, దేశ చరిత్రలో ఆకట్టుకోలేని కెప్టెన్ అతడేనని, అదృష్టం కొద్దీ కెప్టెన్ అయ్యాడంటూ షమా సోషల్ మీడియా వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ నేతలతో పాటు క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అటు బీసీసీఐ కూడా రోహిత్‌పై షమా బాడీ షేమింగ్ వ్యాఖ్యలు దురదృష్టకరమని పేర్కొంది. అలాగే పలువురు మాజీ క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు కూడా ఆమె వ్యాఖ్యలు సరైనవి కావని అన్నారు.
ఈ వివాదంపై తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. అవమానకర, బాడీ షేమింగ్ వ్యాఖ్యలు కాంగ్రెస్ వారికి కొత్త కాదని ఆయన చురకలంటించారు.
“రోహిత్‌పై కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మహ్మద్ చేసిన వ్యాఖ్యలపై చాలా మంది ఎందుకు కోపంగా ఉన్నారో నాకైతే అర్థం కావడం లేదు. బాడీ షేమింగ్, అవమానకర వ్యాఖ్యలు, భ్రాంతికర ప్రకటనలు కాంగ్రెస్ పార్టీ ముఖ్య లక్షణం. హిట్‌మ్యాన్‌కు కాంగ్రెస్ ప్రతినిధి నుంచి ఫిట్‌నెస్ సలహా, విజయాలపై ఉపన్యాసాలు అవసరమని అనుకోవడం పెద్ద జోక్.
సినిమా తారలు, వారి కుటుంబ సభ్యులపై అవమానకర వ్యాఖ్యలతో ఒక తెలంగాణ మంత్రి కోర్టుకు హాజరవుతున్నారని మీకు తెలుసా…? రోహిత్ భాయ్ మీరు అనుభవించిన కఠిన క్షణాలకు ఒక తోటి భారతీయుడిగా క్షమాపణలు చెబుతున్నా. మీరు ఒక సంపూర్ణ రాక్‌స్టార్. ఏ తెలివి తక్కువ రాజకీయ నేత అభిప్రాయం మీ ప్రతిష్ఠను దెబ్బతీయలేదు” అని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు