వరంగల్ బ్యూరో, మార్చి 01 (ప్రజాజ్యోతి):
కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. వరంగల్ బీసీ సభలో ఓ సామాజిక వర్గాన్ని ఎత్తిపొడుస్తూ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ అతనికి షోకాస్ నోటీసులు జారీ చేసింది. అట్టి నోటీసులకు స్పందించక పోవటంతో క్రమ శిక్షణ చర్యలు తీసుకుంది. పార్టీ డిసిప్లినరి యాక్షన్ కమిటీ నుండి జారీ అయినటువంటి నోటీసులకు తీన్మార్ మల్లన్న స్పందించకపోవడంతో.. సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 5 న తీన్మార్ మల్లన్నకు కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక చర్యలపై మల్లన్నను కమిటీ వివరణ కోరింది. ఫిబ్రవరి 12 వ తేదీలోపు వివరణ ఇవ్వాలని మల్లన్నకు కమిటీ గడువు ఇచ్చింది. వివరణ ఇవ్వకపోవడంతో తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ మల్లన్న కొంతకాలంగా విమర్శలు వినిపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేపై పెద్ద ఎత్తున విరుచుకు పడ్డాడు. కులగణన నివేదికను బహిరంగంగా చించివేశారు. అలాగే ఇతర సామాజిక వర్గాలపై కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బీసీ సభలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర పదజాలంతో ఓ సామజిక వర్గాన్ని దూషించడంపై పీసీసీకి ఫిర్యాదులు అందాయి. దీంతో మల్లన్న వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులకు తీన్మార్ మల్లన్న స్పందించకపోవడంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది .