గవర్నర్ అంటే అంత లెక్కలేనితనమా?: పవన్ కల్యాణ్

V. Sai Krishna Reddy
1 Min Read

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో స్పందించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై నేడు అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా పవన్ ప్రసంగిస్తూ… గౌరవ గవర్నర్ గారు ప్రసంగిస్తుంటే వైసీపీ నేతలు దారుణంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఇలాంటి నేతలను ఇన్ని సంవత్సరాలుగా చంద్రబాబునాయుడు గారు ఎలా తట్టుకుని నిలబడగలిగారా? అని నిన్నటి ఘటన తర్వాత నాకనిపించింది అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

చంద్రబాబు గారికి హ్యాట్సాఫ్.. అలాంటి వారిని ఎదుర్కోవాలంటే ఎంతో ధైర్యం, తెగువ ఉండాలి. నిన్న సభలో గొడవ చేసిన వైసీపీ నేతలు… గవర్నర్‌ గారు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఆయన కళ్లలోకి చూడగలిగేవారా? చట్టాలు చేయాల్సిన వారే ఉల్లంఘిస్తే ఎలా? నిబంధనలు మాకు పట్టవనేలా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్న తీరు ప్రజలంతా గమనిస్తున్నారు. గత ఐదేళ్లుగా వారు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, గొడవలు భరించలేకే ప్రజలు మా మీద నమ్మకంతో ఇంతటి బాధ్యతనిచ్చారు.

పరిపాలనలో సమూల మార్పులు తెస్తున్నాం. ప్రభుత్వానికి తన ప్రసంగం ద్వారా దిశానిర్దేశం చేసిన గవర్నర్ గారికి ధన్యవాదాలు. గత వైసీపీ పాలనలో ఎన్ని ఇబ్బందులుపెట్టినా బలంగా నిలబడగలిగామంటే ప్రజలకు మంచి చేయాలన్న బలమైన ఆకాంక్షే కారణం.

2024 ఎన్నికల తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశంలోనే వైసీపీ నాయకులకు తగిన గౌరవం ఇవ్వాలని సీఎం గారు అందరికీ చెప్పారు. అదే బాధ్యతతో మేం మెలుగుతున్నాం. భవిష్యత్తులోనూ ఇదే ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపుకుని సభలో హుందాతనం ప్రదర్శిస్తాం. నిన్న సభలో వైసీపీ చేసిన రాద్ధాంతానికి గవర్నర్ గారు ఇబ్బందిపడి ఉంటే ఆయనకు ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను” అని పవన్ పేర్కొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *