ఆంధ్రప్రదేశ్ లో బర్డ్ ఫ్లూ కలకలం రేగుతోంది. ఏలూరు జిల్లాలో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్లు వైద్యశాఖ అధికారులు నిర్ధారించారు. జిల్లాలోని ఉంగుటూరు మండల పరిధిలో కోళ్ల ఫారం సమీపంలో ఉంటున్న వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు తేలింది. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేకంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్న వారిని ప్రత్యేకంగా పరీక్షిస్తున్నారు. శాంపుల్స్ సేకరించి ల్యాబ్ కు పంపిస్తున్నారు. ఏపీలో మనుషుల్లో బర్డ్ ఫ్లూ వైరస్ కు సంబంధించి తొలి కేసు నమోదైందని అధికారులు చెప్పారు.
ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. కానూరులో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు ఇప్పటికే నిర్ధారణ కాగా, ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 50 లక్షల పైచిలుకు కోళ్లు ఈ వైరస్ తో చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. కొంతకాలం పాటు చికెన్ కు దూరంగా ఉండాలని వైద్య శాఖ అధికారులు ప్రజలకు సూచించారు. అధికారుల హెచ్చరికలు, సోషల్ మీడియాలో ప్రచారం కారణంగా చికెన్ కొనుగోళ్లు తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు పడిపోయాయి.