దశాబ్దాల సమస్యకు చెక్ పెట్టాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయించింది. డూప్లికేట్ ఓటర్ ఐడీలను ఏరివేయాలని యోచిస్తోంది. ఇందుకోసం మూడు నెలల గడువు పెట్టుకుంది. ప్రతి ఒక్కరి ఓటు విలువైనదేనని, అందరూ ఓటు హక్కు వినియోగించుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయానికి వచ్చింది. ఓటరు జాబితాలో కచ్చితత్వం కోసం ఈ నిర్ణయం తీసుకొంది. ఓటు హక్కు కేటాయింపు ప్రక్రియలో అసమానతల కారణంగా కొందరు ఓటర్లకు నకిలీ ఫొటో గుర్తింపు కార్డు (ఈపీఐసీ) నంబర్లు జారీ అయినట్టు గుర్తించిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇది ఇప్పటి సమస్య కాదు.. 2000వ సంవత్సరం నుంచే ఉంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అప్పుడే ఈపీఐసీ నంబర్లు ప్రవేశపెట్టారు. అయితే, కొందరు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు సరైన నంబరింగ్ విధానాన్ని అనుసరించకపోవడంతో నకిలీ నంబర్లు పుట్టుకొచ్చాయి.
ఒక ఓటర్ ఒక నిర్దిష్ట పోలింగ్ స్టేషన్‌కు అనుసంధానించబడి ఉంటాడు. ఈపీఐసీ సంఖ్యతో సంబంధం లేకుండా అతడు అక్కడ మాత్రమే ఓటు వేయగలుగుతాడని ఎన్నికల సంఘం ఈ సందర్భంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో నకిలీ కార్డుల ఏరివేతకు ప్రత్యేకమైన జాతీయ ఈపీఐసీ నంబర్లను జారీ చేయాలని నిర్ణయించింది. నకిలీల నివారణలో భాగంగా కొత్త ఓటర్లకు ప్రత్యేక సంఖ్యను కేటాయిస్తారు. ఈ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తిచేయాలని నిర్ణయించారు. ఓటరు జాబితాలో పారదర్శకతతోపాటు తప్పులను నివారించేందుకు ఈ చర్య ఉపయోగపడుతుందని ఎన్నికల సంఘం పేర్కొంది.
దేశ ఎన్నికల డేటాబేస్‌లో 99 కోట్ల మందికి పైగా నమోదిత ఓటర్లు ఉన్నారు. ఓటరు జాబితాను నవీకరించడం అనేది జిల్లా ఎన్నికల అధికారులు, ఓటరు నమోదు అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతుంది. దీనికి ప్రజలతోపాటు రాజకీయ పార్టీల భాగస్వామ్యం కూడా ఉంటుంది. సాధారణంగా ప్రతి సంవత్సరం అక్టోబర్, డిసెంబర్ మధ్య వార్షిక ఓటు నమోదు ప్రక్రియ జరుగుతుంది. తుది జాబితాను జనవరిలో విడుదల చేస్తారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలకు ముందు అదనపు సవరణ నిర్వహిస్తారు