ముసాయిదా ఓటరు జాబితాలో తప్పులుంటే సరిచేసుకోవాలి
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి: ఆర్డీఓ డీఎస్ వెంకన్న
దామెర, ఆగస్టు 27 (ప్రజాజ్యోతి):
ముసాయిదా ఓటరు జాబితాలో తప్పులుంటే సరిచేసుకోవాలని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆర్డీఓ డీఎస్ వెంకన్న తెలిపారు. దామెర మండలంలోని అన్ని గ్రామాల్లో గురువారం ఎస్ఐఆర్ (ప్రత్యేక సమగ్ర సవరణ) కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక గ్రామసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా ముసాయిదా ఓటరు జాబితాను ప్రజల పరిశీలనకు ఉంచి, ఓటర్ల వివరాల్లో ఉన్న తప్పులు, అభ్యంతరాలు, మార్పులు, చేర్పులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఒగ్లాపూర్ గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభకు పరకాల ఆర్డీఓ డీఎస్ వెంకన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముసాయిదా ఓటరు జాబితా ఇప్పటికే ప్రకటించబడిందని తెలిపారు. జాబితాలో 179 మంది ఓటర్ల పేర్లు, తండ్రి పేర్లు తదితర వివరాల్లో తప్పులు గుర్తించినట్లు వెల్లడించారు. అదేవిధంగా ఆరుగురు ఓటర్ల మ్యాపింగ్ పూర్తికాకుండా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. తప్పులు గుర్తించిన ఓటర్లకు సంబంధించి నోటీసులు అందజేస్తున్నామని ఆర్డీఓ తెలిపారు. నోటీసులు అందుకున్న వారు అందులో సూచించిన తేదీన సంబంధిత విచారణకు తప్పనిసరిగా హాజరై తమ వివరాలను సరిచేసుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో తమ పేరు, తండ్రి పేరు, వయస్సు, చిరునామా తదితర వివరాలను ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని కోరారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆర్డీఓ డీఎస్ వెంకన్న సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమైనదని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును పొందేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మీదేవి, ఆర్ఐ రాధాకృష్ణ, సర్పంచ్ శ్రీధర్ రెడ్డి, జీపీఓ హరిప్రసాద్, సూపర్వైజర్ శ్రీమాత, బీఎల్ఓలు, ఓటర్లు తదితరులు పాల్గొన్నారు.
