వరంగల్ బ్యూరో, ఫిబ్రవరి 27 (ప్రజా జ్యోతి):
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ లో ప్రతిష్టాత్మక సాంస్కృతిక ఉత్సవం ‘స్ప్రింగ్ స్ప్రీ 2025’ కార్యక్రమాన్ని
ఫిబ్రవరి 28 నుండి మార్చి 2, 2025 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యధర్ సుబుధి ప్రెస్ కు వివరాలు వెల్లడించారు. 1978లో ఆవిర్భవించిన స్ప్రింగ్ స్ప్రీ దక్షిణ భారతదేశంలో అతిపెద్ద సాంస్కృతిక ఉత్సవాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది వినోదం, మేధోపరమైన స్పూర్తిని కలిగించే కార్యక్రమాలు, అద్భుతమైన ప్రో షోలు కలయికగా జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని అందిస్తుంది. స్ప్రింగ్ స్ప్రీ కళ, సాహిత్యం, నాటకం, నృత్యం, సంగీతం, క్విజ్, ఫోటోగ్రఫీ, పెయింటింగ్, ఫ్యాషన్ షోలు, రాక్ మ్యూజిక్ పోటీలు, మోడల్ యునైటెడ్ నేషన్స్, మినిట్ మేడ్ వంటి విభిన్న రంగాల్లో ఆసక్తికరమైన కార్యక్రమాలను ప్రదర్శిస్తుంది. విద్యార్థులకు వారి ప్రతిభను ప్రదర్శించేందుకు గొప్ప వేదికను అందించడంతో పాటు కొత్త కళా ప్రదర్శనలను ప్రోత్సహిస్తుంది. ప్రో షోలు
స్ప్రింగ్ స్ప్రీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అంశాల్లో ఒకటి ప్రో షోలు. ఇందులో ప్రముఖ కళాకారులు ప్రదర్శనలు ఇస్తారు. పాల్గొనే విద్యార్థులతో పాటు వరంగల్ నలుమూలల నుండి ప్రజలను ఆకర్షిస్తుంది.
ఫిబ్రవరి 28, 2025 (మొదటి రోజు):
గిన్నిస్ వరల్డ్ రికార్డు హోల్డర్, పద్మశ్రీ డా. కె. బ్రహ్మానందం గారు ప్రధాన అతిథిగా హాజరై విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించనున్నారు.
మార్చి 1, 2025 (రెండవ రోజు):
భారతీయ రాక్ బ్యాండ్ ‘వార్టెక్స్’ వారి విభిన్నమైన ఫ్యూజన్ మ్యూజిక్‌తో ప్రేక్షకులను అలరించనుంది. అలాగే, రెండు సినిమా బృందాలు విద్యార్థులతో ప్రత్యక్షంగా ముఖాముఖి చర్చలో పాల్గొంటాయి.
మార్చి 2, 2025 (మూడవ రోజు) ప్రముఖ గాయకుడు అమిత్ త్రివేది గారు తన సంగీత ప్రదర్శనతో సందడి చేయనున్నారు. ప్రధాన కార్యక్రమాలు.. నృత్య పోటీలు, సోలో మరియు గ్రూప్ డాన్స్, సంగీత పోటీలు.. కవర్ సాంగ్స్, రాక్ బ్యాండ్ పోటీలు, ఫ్యాషన్ షో.. అల్లూర్ డ్రామా & నాటకం నుక్కడ్ నాటక్, కాస్ప్లే పోటీలు.. వివిధ పాత్రల అవతారాలలో పోటీదారులు,ఫిల్మ్ మేకింగ్ పోటీలు, గేమింగ్ పోటీలు, హిస్పాల్ క్విజ్, స్ట్రీట్ బ్యాటిల్, సైలెంట్ డీజే, సాహిత్య చర్చలు: చిత్రాలు మరియు సంగీతంపై వాదోపవాదాలు, ప్రత్యేక ఆకర్షణలు.. బైక్ స్టంట్స్, మేజిక్ షో, క్యాంపస్ మొత్తం వినోదకరమైన, మస్తీతో కూడిన కార్యకలాపాలు చేపట్టనున్నారు. స్ప్రింగ్ స్ప్రీ 2025 విద్యార్థులకు ఒక అద్భుతమైన అనుభూతిని అందించేందుకు, సృజనాత్మకతను వెలికితీసేందుకు, మరియు వారికి గొప్ప జ్ఞాపకాలను అందించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్టు డైరెక్టర్ తెలిపారు.