నా పేరును మార్చడానికి మీరెవరు?: రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి ఆగ్రహం

V. Sai Krishna Reddy
1 Min Read

మా తల్లి పెట్టిన పేరును మార్చి పిలవడానికి మీరెవరంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను ఎవరికో దత్తపుత్రుడినని, కల్వకుంట్ల కిషన్ రావు అని పేరు మార్చుకోవాలని ముఖ్యమంత్రి విమర్శలు చేయడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పేరు మార్చి పిలవడం సరికాదని అన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య ఏమైనా ఉంటే వారే తేల్చుకోవాలని, తనను మధ్యలోకి లాగవద్దని సూచించారు.

అంతగా అవసరమైతే మీరు రేవంత్ ఖాన్ అని మార్చుకోవచ్చని, తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. కానీ మా తల్లి పెట్టిన పేరును మార్చడానికి మీరెవరని ప్రశ్నించారు. వ్యక్తిగత విమర్శలు సరికాదని హితవు పలికారు. మజ్లిస్ పార్టీతో కలిసి ముందుకు సాగినన్ని రోజులు మేం నిలదీస్తూనే ఉంటామని అన్నారు. తెలంగాణలో అన్ని స్థానాల్లో మజ్లిస్ పార్టీ ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు.

కేసీఆర్‌ను అరెస్టు చేయాలంటూ మాకు చెప్పడమేమిటని ప్రశ్నించారు. కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్టు చేస్తే ఎవరూ అడ్డురాకుండా తాను చూసుకుంటానని అన్నారు. కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిదా? లేక కిషన్ రెడ్డిదా? తెలంగాణ ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకలు ఒక్కసారైనా కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడారా అని ప్రశ్నించారు.

బీజేపీ ఎప్పుడూ బీఆర్ఎస్ పార్టీతో కలవలేదని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను రెండేళ్లు పూర్తయినా అమలు చేయలేదని విమర్శించారు. మక్తల్ బీజేపీ అభ్యర్థి మహదేవప్ప మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని అన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *