బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన “సామాజిక తెలంగాణ” వ్యాఖ్యలపై మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా స్పందించారు. “కవిత ఇప్పుడు సామాజిక తెలంగాణ అంటూ కొత్త నినాదం అందుకుంది” అని ఆయన ఎద్దేవా చేశారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేవలం ముగ్గురు బీసీలకు మాత్రమే మంత్రివర్గంలో స్థానం కల్పించారని గుర్తుచేశారు.
“ఆనాడు బీసీల గురించి మీ నాన్నను ఎందుకు అడగలేదు? అప్పుడు సామాజిక న్యాయం ఎటు పోయింది?” అని రఘునందన్ రావు నిలదీశారు. కవిత చేసే తాటాకు చప్పుళ్లకు, ఉడత ఊపులకు బీజేపీ భయపడబోదని ఆయన అన్నారు.
కాగా, కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి, జూన్ 2న కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారంటూ వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఆమె పార్టీ ఏర్పాటు ప్రచారాన్ని ఖండించారు. అదే సమయంలో, ఈరోజు తెలంగాణ జాగృతి ద్వారా ఆమె మళ్లీ క్రియాశీలకంగా మారడంతో పాటు కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు.