చరిత్ర సృష్టించిన మహనీయుడు ఎన్టీఆర్: చంద్రబాబు

V. Sai Krishna Reddy
1 Min Read

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత నేత నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఒక సంఘ సంస్కర్త అని, సంక్షేమానికి సరికొత్త మార్గం చూపిన మహనీయుడని కొనియాడారు. పేద ప్రజలకు కూడు, గూడు, గుడ్డ అనే మూడు ప్రాథమిక అవసరాలు తీర్చడమే తన జీవిత లక్ష్యంగా భావించిన ధీరోదాత్తుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు ప్రశంసించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, “సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ప్రజాస్వామ్యానికి కొత్త నిర్వచనం పలికిన దార్శనికుడు ఎన్టీఆర్. అన్నగా ఆయన ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు కల్పించారు. మండల వ్యవస్థను తీసుకొచ్చి పరిపాలనను ప్రజల ముంగిటకు చేర్చారు. పక్కా ఇళ్ల నిర్మాణ పథకంతో పేదలకు అండగా నిలిచారు. కిలో రెండు రూపాయలకే బియ్యం అందించి పేద ప్రజల ఆకలి తీర్చిన గొప్ప మనసున్న నేత” అని అన్నారు.

“నా తెలుగు జాతి ప్రపంచ యవనికపై సగర్వంగా తలెత్తుకుని నిలబడాలన్నదే ఎన్టీఆర్ ఏకైక సంకల్పం. ఆయన చరిత్రలో ఒక స్థానం సంపాదించుకోవడమే కాదు, స్వయంగా చరిత్రనే సృష్టించిన చిరస్మరణీయుడు. ఈనాటికీ తెలుగుదేశం పార్టీ ఉజ్వలంగా ప్రకాశిస్తోందంటే అది ఆయన దివ్యాశీస్సుల బలమే. ఆ మహనీయుడి ఆశయాలను, సంకల్పాన్ని నెరవేర్చడానికి మేమంతా అహర్నిశలూ శ్రమిస్తూనే ఉన్నాం. సమసమాజ స్థాపన దిశగా మా ప్రయాణం కొనసాగుతోంది” అని ముఖ్యమంత్రి వివరించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *