వేసవి సెలవులకు బంధువుల ఇంటికి వచ్చిన చిన్నారులు ప్రమాదవశాత్తూ చెరువులో మునిగిపోయారు. ఈతకు వెళ్లి నీళ్లలో గల్లంతయ్యారు. కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం మల్లేపల్లెలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుందీ విషాదం. ఐదుగురు చిన్నారులలో నలుగురు బంధువుల ఇంటికి వచ్చిన వారే కావడం గమనార్హం. ఆడుకోవడానికి వెళ్లిన బాలురు చీకటి పడుతున్నా తిరిగి రాకపోవడంతో మల్లేపల్లెలో కలకలం రేగింది. వారిని వెతుక్కుంటూ వెళ్లిన కుటుంబ సభ్యులు, బంధువులకు చెరువు ఒడ్డున పిల్లల బట్టలు కనిపించాయి.
దీంతో వెంటనే అధికారులకు సమచారం అందించగా.. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అధికారులు గజ ఈతగాళ్లను పిలిపించి చెరువులో గాలింపు చేపట్టారు. రాత్రి వరకు నాలుగు మృతదేహాలు బయటపడగా.. మరో బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన వారిని దీక్షిత్, తరుణ్, పార్థు, చరణ్ గా గుర్తించారు. మరో బాలుడు హర్ష ఆచూకీ ఇంకా దొరకలేదని వివరించారు. చనిపోయిన పిల్లలంతా పన్నెండేళ్లలోపు చిన్నారులేనని తెలిపారు. కాగా, మృతదేహాలు బయటపడడంతో చిన్నారుల తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.
ఓ బాలుడి ఏడుపు మరో బాలుడిని కాపాడింది..
చెరువులో ఈత కోసం మొత్తం ఏడుగురు బాలురు వెళ్లారని గ్రామస్థులు తెలిపారు. అయితే, మార్గమద్యలో ఓ బాలుడు ఏడ్వడం మొదలుపెట్టాడు. దీంతో ఏడుస్తున్న ఆ బాలుడిని తీసుకుని మరొక బాలుడు వెనుతిరిగారు. దీంతో వారిద్దరు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.