ఐపీఎల్ 18వ సీజన్ మే 17 నుంచి కొత్త షెడ్యూల్ ప్రకారం కొనసాగనుంది. అయితే, తేదీలు మారడంతో మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేసిన వారిలో గందరగోళం నెలకొంది. రద్దయిన మ్యాచ్ టికెట్ల డబ్బులను రీఫండ్ చేసేందుకు ఫ్రాంచైజీలు అంగీకరించాయి. షెడ్యూల్ మారడంతో ముందస్తుగా టికెట్లు కొనుగోలు చేసిన వాళ్లు తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతుండగా, వారికి శుభవార్త తెలిపాయి.
ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన వారిని స్టేడియంలోకి అనుమతిస్తామని తెలిపాయి. ఐపీఎల్ పునరుద్ధరణ తర్వాత మే 17న తొలి మ్యాచ్ జరగనుంది. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ సొంత మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్‌తో మే 23న తలపడనుంది.
మొదటి షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ మే 13న జరగాల్సి ఉండగా, భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వారం రోజులు లీగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో టికెట్ల కొనుగోలుదారుల్లో గందరగోళం నెలకొంది.
ఈ నేపథ్యంలో షెడ్యూల్ మార్పు కారణంగా అప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన వారు కంగారు పడొద్దని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తెలిపింది. చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమిస్తున్న ఈ మ్యాచ్‌కు ఇంతకు ముందే టికెట్లు కొన్న వాళ్లందరినీ అనుమతిస్తామని మంగళవారం ఎక్స్ వేదికగా యాజమాన్యం పోస్ట్ పెట్టింది. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.