ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ జరిపిన ప్రతిదాడిలో పాకిస్థాన్‌లోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌కు భారీ నష్టం వాటిల్లింది. ఈ మేరకు చైనా విడుదల చేసిన తాజా శాటిలైట్ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. ఉద్రిక్త పరిస్థితుల్లో సంయమనం పాటించినప్పటికీ, పాక్ చర్యలను భారత్ సమర్థంగా తిప్పికొట్టింది.
క్షిపణులు, డ్రోన్లతో పాకిస్థాన్ దాడులకు పాల్పడటంతో భారత్ ప్రతీకార దాడులకు దిగింది. ఈ దాడుల్లో పాక్‌లోని పలు సైనిక స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌కు గణనీయమైన నష్టం వాటిల్లింది.
రావల్పిండిలో ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పాకిస్థాన్‌కు అత్యంత ముఖ్యమైన వైమానిక స్థావరం. భారత్ తన సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకే పాక్‌లోని వైమానిక స్థావరంపై దాడి చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ దాడిలో నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌లోని రన్‌వే ధ్వంసమైనట్లు నివేదికలు సూచిస్తున్నాయి. దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను చైనా తాజాగా విడుదల చేసింది.