అంగన్వాడీ టీచర్ల గొంతు నొక్కేందుకే ముందస్తు అరెస్టులా..?
అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న బిఆర్ఎస్ సర్పంచ్ అరిగే ధర్మతేజ, అంగన్వాడీ టీచర్ల అరెస్ట్
బీర్కూర్, ప్రజాజ్యోతి, సెప్టెంబర్ 9:
అంగన్వాడీ టీచర్ల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన బీర్కూర్ మండలానికి చెందిన బిఆర్ఎస్ సర్పంచ్ అరిగే ధర్మతేజతో పాటు పలువురు అంగన్వాడీ టీచర్లను పోలీసులు రాత్రికి రాత్రే ముందస్తుగా అరెస్ట్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అంగన్వాడీ టీచర్లకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.18 వేల గౌరవ వేతనం, పీఆర్సీ ప్రకటించాలని, ప్రీ ప్రైమరీ ని అంగన్వాడీ కేంద్రాల్లోనే విలీనం చేయాలనే డిమాండ్లతో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న తమను అడ్డుకోవడం ప్రభుత్వ వైఖరికి నిదర్శనమని అంగన్వాడీ టీచర్లు ఆరోపించారు.
న్యాయం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తుంటే రాత్రివేళ ఇళ్ల వద్దకు పోలీసులు వచ్చి ముందస్తు అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. మహిళా అంగన్వాడీ టీచర్లను సైతం రాత్రివేళ అరెస్ట్ చేయడం బాధాకరమన్నారు.
“అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు.. అంగన్వాడీలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం” అని వారు స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలతో కలిసి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని, తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ అరిగే ధర్మ తేజ అంగన్వాడీ టీచర్లు నాగమణి, సవిత, సరిత తదితరులు పాల్గొన్నారు.
