వెల్దుర్తి (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 05:
వరి పొలం పనులకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన విషాద ఘటన వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామ శివారులో శనివారం చోటుచేసుకుంది.ఎస్ఐ కరుణాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, మానేపల్లి గ్రామానికి చెందిన రిక్కం శ్రీకాంత్ (30) తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ఉదయం సుమారు 6 గంటలకు వ్యవసాయ పొలానికి వరి పనుల నిమిత్తం వెళ్లాడు.ఉదయం సుమారు 9:30 గంటల సమయంలో పొలానికి నీరు పెట్టేందుకు మోటార్ ఆన్ చేయడానికి వెళ్లిన శ్రీకాంత్‌కు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో తీవ్ర షాక్‌కు గురైన శ్రీకాంత్ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. మృతుడి భార్య అనుష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ కరుణాకర్ రెడ్డి తెలిపారు.
