సూర్యాపేట జిల్లా ప్రతినిధి జూలై 25(ప్రజాజ్యోతి):ప్రభుత్వ పాఠశాలలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నాయని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కోహెన్స్ సీఎస్ఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు డిజిటల్ విద్య, నైపుణ్యాభివృద్ధి కూడా ఎంతో అవసరమని అన్నారు.భవిష్యత్తులో పోటీ ప్రపంచానికి తగిన విధంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని పేర్కొన్నారు.ఉపాధ్యాయుల అంకితభావం వల్ల ఈ విద్యా సంవత్సరంలో ఒక్క ఈ పాఠశాలలోనే 121 మంది కొత్త విద్యార్థులు చేరగా, జిల్లా వ్యాప్తంగా సుమారు 10113 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని తెలిపారు. త్వరలో ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.విద్యార్థులు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, బయట ఆహారం తినకుండా ఇంటి భోజనం లేదా పాఠశాలలో అందించే పోషకాహారాన్ని తీసుకోవాలని సూచించారు.ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉండటంతో పాటు చదువులోనూ రాణించగలరని అన్నారు. పాఠశాలలో మౌలిక వసతుల కోసం రూ.10 లక్షల నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కోహెన్స్ సిఎస్ఆర్ ఆధ్వర్యంలో కుడకుడ జడ్పీ హైస్కూల్, చివ్వెంల సోషల్ వెల్ఫేర్ పాఠశాల, పెన్ పహాడ్ జెడ్పిహెచ్ఎస్, ఆత్మకూర్ (ఎస్) జెడ్పిహెచ్ఎస్ తదితర పాఠశాలలకు కంప్యూటర్ ల్యాబ్ లను అందించారు.ఈ కార్యక్రమంలో డీఈవో అశోక్, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెలుగు వెంకన్న, పాఠశాల జీహెచ్ఎం గోలి పద్మ, ఎంఈవో శేషగాని శ్రీనివాస్, కోహెన్స్ ప్రతినిధులు వెంకటరమణ, దుస్సా సైదులు, వలి, రామకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
