యథేచ్ఛగా ప్రభుత్వ భూమి నుండి ప్రయివేట్ పాఠశాలకు మట్టి తరలింపు..!
సంగెం,మార్చి30 (ప్రజాజ్యోతి):
వరంగల్ జిల్లా సంగెం మండలం పళ్ళార్గుడా గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూములపై అక్రమార్కుల కన్ను పడింది.ఎటువంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమి నుండి మట్టిని తవ్వి ప్రయివేట్ పాఠశాలలకు తరలిస్తున్నారు. గత కొన్ని రోజులుగా పగలు, రాత్రి తేడా లేకుండా యంత్రాలతో తవ్వకాలు జరుపుతూ ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వ ఆస్తిని ప్రయివేట్ సంస్థల ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని, దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం గండి పడటమే కాకుండా పర్యావరణానికి కూడా నష్టం వాటిల్లుతోందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు.ఇపటికైనా అధికారులు స్పందించి,పళ్ళార్గుడాలో జరుగుతున్న అక్రమ తవ్వకాలను అరికట్టాలని,బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు
