-
కంపు కొడుతున్న అగ్రంప్పాడు జాతర పరిసరాలు
అగ్రంప్పాడు, జనవరి 31 (ప్రజాజ్యోతి):
మినీ మేడారం గా పేరుగాంచిన అగ్రంప్పాడు జాతర పరిసరాలు దుర్వాసనతో కంపుకొడుతున్నాయి. లక్షలాది మంది భక్తులు సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు జాతరకు తరలివస్తుండగా, పరిశుభ్రత లోపంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జాతర ప్రాంగణంలో ఏర్పాటుచేసిన తాత్కాలిక మరుగుదొడ్లు సరిగా నిర్వహించకపోవడంతో పాటు, వ్యర్థాలను సకాలంలో తొలగించకపోవడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోంది. చెత్తకుప్పల మధ్య పందులు స్వేచ్ఛగా తిరుగుతుండటంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేకంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చుచేసి జాతర నిర్వహిస్తున్నా, కనీస పరిశుభ్రత చర్యలు పాటించకపోవడం పట్ల అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకుని, పారిశుధ్య పనులను ముమ్మరం చేసి భక్తులకు శుభ్రమైన వాతావరణం కల్పించాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.
