బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఎవరైనా బెదిరింపులకు గురి చేస్తే సహించేది లేదని, వారి పేర్లను ‘పింక్ బుక్’లో రాసి పెడతామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్వరంతో హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సన్నాహక సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు కాంగ్రెస్ నేతల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీ 24వ వార్షికోత్సవ వేడుకల సన్నాహాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో కవిత మాట్లాడుతూ, బీఆర్ఎస్ కార్యకర్తలకు కొందరు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారనే సమాచారం తనకు అందిందని తెలిపారు. “ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ల పేర్లు బరాబర్ పింక్ బుక్‌లో రాస్తాం. విడిచి పెట్టేదైతే లేదు. కార్యకర్తలు ఏమీ ఆలోచించవద్దు, ధైర్యంగా ఉండండి” అని ఆమె భరోసా ఇచ్చారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావన తెస్తూ, “కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు. నేను కొంచెం రౌడీ టైప్. ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదు” అని కవిత వ్యాఖ్యానించారు. కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసిన వారిని, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిన వారిని తాను క్షమించే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. బెదిరింపులకు పాల్పడేది నాయకులైనా, అధికారులైనా ఎవరినీ వదిలిపెట్టబోమని ఆమె తేల్చి చెప్పారు.
తాము అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ అరాచకాలకు పాల్పడలేదని, కేవలం అభివృద్ధి, సంక్షేమంపైనే దృష్టి సారించామని కవిత గుర్తు చేశారు. ఇప్పుడు కొందరు పార్టీ మారినంత మాత్రాన బీఆర్ఎస్ కార్యకర్తలను భయపెట్టాలని చూడటం సరికాదన్నారు. “మీ తాట తీస్తాం అంటే భయపడేటోళ్లు ఇక్కడ ఎవరూ లేరు. మీ తాత, ముత్తాత, జేజమ్మ దిగివచ్చినా కూడా భయపడేది లేదు” అంటూ ఆమె కార్యకర్తల్లో స్థైర్యం నింపే ప్రయత్నం చేశారు