ప్రపంచ ఎలుకల దినోత్సవాన్ని ఏప్రిల్ 4న జరుపుకుంటారు. ఈ రోజును జరుపుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం ఎలుకలను పెంపుడు జంతువులుగా ప్రోత్సహించడం. అయితే, ఇప్పుడు ఎలుకలు దాదాపు ప్రతి దేశానికి పెద్ద సమస్యగా మారాయి. ఎలుకల బెడద దాదాపు ప్రతి దేశంలోనూ ఉంది. అమాయకంగా కనిపించే ఈ చిన్న జీవి మన ఇళ్లలో మాత్రమే కాకుండా ప్రభుత్వాలకు కూడా పెద్ద సమస్యగా మారుతోంది.
ఈ భూమిపై మనుషులను ఎక్కువగా ఇబ్బంది పెట్టిన జీవులు ఏవైనా ఉన్నాయంటే అవి ఎలుకలే. ఇంటి వంటగది, స్టోర్ రూమ్ లేదా బీరువా.. ఎలుకలు ప్రతిచోటా ఉండి వస్తువులను పాడు చేస్తాయి. అంతేకాకుండా వీటి వల్ల అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంది.
పెద్ద పెద్ద ప్రభుత్వ రేషన్ గిడ్డంగుల్లో కూడా ఎలుకల బెడద తీవ్రంగా ఉండటంతో ఇది పెద్ద సమస్యగా మారింది. ప్రపంచంలో ఎలుకలు లేని ప్రదేశం బహుశా ఉండకపోవచ్చు. కానీ ప్రపంచంలో అత్యధికంగా ఎలుకలు ఉన్న దేశం ఏది? ఈ జాబితాలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎక్కడైతే ఎలుకలకు మంచి ఆశ్రయం, తగినంత ఆహారం లభిస్తుందో అక్కడ వాటి జనాభా ఎక్కువగా పెరుగుతుంది. ఈ విషయంలో భారతదేశం ఎలుకలకు ఇష్టమైన దేశం. ఒక అంచనా ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా ఎలుకలు భారతదేశంలోనే ఉన్నాయి. దీనికి మరొక ముఖ్య కారణం ఎలుకల పట్ల ఉన్న మతపరమైన దృక్పథం కూడా
ఎలుకల జనాభా విషయంలో చైనా రెండవ స్థానంలో ఉన్నట్లు భావిస్తున్నారు. ఇక్కడ కూడా నివాస ప్రాంతాలలో వాటికి పెరగడానికి తగినంత ఆహారం లభిస్తుంది. అంతేకాకుండా ఇక్కడి వాతావరణం కూడా వాటి పునరుత్పత్తికి అనుకూలంగా ఉంటుంది. ఈ విషయంలో అమెరికా ఎలుకల జనాభా కలిగిన మూడవ అతిపెద్ద దేశం. ఇక్కడి న్యూయార్క్, చికాగో , లాస్ ఏంజిల్స్ నగరాలు ఎలుకల బెడదతో ఎక్కువగా బాధపడుతున్నాయి. ఇండోనేషియా ఎలుకల జనాభా విషయంలో నాల్గవ స్థానంలో ఉంది. దీని తర్వాత బంగ్లాదేశ్ ఐదవ స్థానంలో ఉంది. ఇక్కడ కూడా ఎలుకలు పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి.