ఆకాశమంత పందిరి.. భూదేవి అంత పీట వేసి.. మామిడి తోరణాలు.. మేళతాళాలు.. ఏకశికర వాసుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు పాంచ నరసింహుడు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం కనుల పండవగా జరిగింది. కరతాళ ధ్వనుల మధ్య ముళ్లోకాది దేవతలు చూస్తుండగా నరసింహస్వామి వారు లక్ష్మీఅమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేశారు. స్వర్ణ కర్పూర కాంతుల నడుమ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవ తిరుకల్యాణ వేడుక అంబరాన్ని తాకింది. స్వామివారు కళ్యాణాన్ని భక్తులు తిలకించి తరించారు. యాదాద్రి కొండపై స్వామివారి కళ్యాణం జరిగినంత సేపూ కల్యాణ మంటపం, యాదాద్రి క్షేత్రమంతా గోవింద నామస్మరణతో మార్మోగింది. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశేష ఘట్టమైన కల్యాణోత్సవం శనివారం రాత్రి పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం వైభవోపేతంగా నిర్వహించారు. ఏకశిఖరవాసుడైన నారసింహుడు ఏకపత్నీవ్రతుడైన శ్రీరామచంద్రుడి అలంకరణలో గజవాహనంపై ఊరేగింపుగా రాగా భక్తకోటికి సకల సంపదలను ప్రసాదించే మహాలక్ష్మి అమ్మవారు పుష్పాల పల్లకిలో కల్యాణ వేదికకు బయలుదేరారు.
కల్యాణ వైభోగమే.. లక్ష్మీ నరసింహుడి కళ్యాణం కమనీయం..
శ్రీస్వామి వారు ధర్మమూర్తియైన శ్రీరామ అలంకారంలో హనుమంత వాహనముపై భక్తులకు దర్శన భాగ్యం కలిగించి ‘ధర్మో రక్షతి రక్షితః’ అను సందేశాన్ని తెలియజేస్తున్నాడని శ్రీరామ అలంకారము, హనుమంత సేవ విశిష్టతను వేద పండితులు వివరించారు. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఊరేగింపుగా వచ్చిన వధూవరులు.. పుష్పాలంకరణ, విద్యుద్దీపాలతో మిరుమిట్లు గొలుపుతున్న ఆలయ ఉత్తర మాడవీధిలోని కల్యాణ వేదికపై ఆసీనులయ్యారు. కల్యాణ మండపంలో ఆలయ అర్చకులు స్వామి,అమ్మవార్లను అధిష్టింప జేసి కల్యాణ ఘట్టాన్ని ఆరంభించారు. విశ్వక్సేనుడి తొలి పూజలతో ప్రారంభమై.. స్వామికి యజ్ఞోపవీతధారణ జరిపి పాదప్రక్షాళన గావించారు. సాక్షాత్తు బ్రహ్మ నిర్ణయించిన అభిజిత్ లగ్న సుముహూర్తాన రాత్రి 8.45 గంటలకు దేవదేవుడు, మహాలక్ష్మి అమ్మవార్లను జీలకర్ర బెల్లంతో అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, వేద పారాయణాలు, మంగళ వాయిద్యాల, కరతాళ ధ్వనుల మధ్య ముళ్లోకాది దేవతలు చూస్తుండగా నరసింహస్వామి వారు లక్ష్మీఅమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేశారు