ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇవాళ జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు దక్షిణాఫ్రికాపై 50 పరుగుల తేడాతో నెగ్గింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ డేవిడ్ మిల్లర్ వీరోచిత శతకం సాధించినా ప్రయోజనం లేకపోయింది. 363 పరుగుల భారీ లక్ష్యఛేదనలో సఫారీలు 50 ఓవర్లలో 9 వికెట్లకు 312 పరుగులు మాత్రమే చేశారు.
మిల్లర్ ఆట చివరి బంతికి సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. ఓ దశలో దక్షిణాఫ్రికా 218 పరుగులకే 8 వికెట్లు కోల్పోయినప్పటికీ, మిల్లర్ విధ్వంసక బ్యాటింగ్ తో స్కోరుబోర్డును పరుగులెత్తించాడు. అయితే, మరో ఎండ్ లో అతడికి సహకరించే వారు లేకపోవడంతో దక్షిణాఫ్రికాకు ఓటమి తప్పలేదు. మిల్లర్ 67 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సులతో 100 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
అంతకుముందు, కెప్టెన్ టెంబా బవుమా (56), వాన్ డర్ డుసెన్ (69) అర్ధసెంచరీలతో రాణించారు. 22.1 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 125 పరుగులతో పటిష్ట స్థితిలో ఉన్న దక్షిణాప్రికా జట్టును కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ దెబ్బకొట్టాడు. కొద్ది వ్యవధిలోనే 3 వికెట్లు తీసి సఫారీలను ఒత్తిడిలోకి నెట్టాడు. మాజీ కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ 31 పరుగులు చేయగా… డాషింగ్ బ్యాట్స్ మన్ హెన్రిచ్ క్లాసెన్ (3) విఫలం కావడం ఆ జట్టు అవకాశాలను దెబ్బతీసింది.
న్యూజిలాండ్ బౌలర్లలో శాంట్నర్ 3, మాట్ హెన్రీ 2, గ్లెన్ ఫిలిప్స్ 2, బ్రేస్వెల్ 1, రచిన్ రవీంద్ర 1 వికెట్ తీశారు. ఇక, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. మార్చి 9న దుబాయ్ లో ఈ టైటిల్ సమరం జరగనుంది