కుమార్తె వివాహ వేడుకలో ఓ తండ్రి గుండెపోటుతో మృతి చెందిన హృదయవిదారక ఘటన కామారెడ్డి జిల్లాలో శుక్రవారం జరిగింది. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన కుడిక్యాల బాల చంద్రం (56) వృత్తి రీత్యా కామారెడ్డిలో స్థిరపడ్డాడు. ఆయనకు భార్య రాజమణి, ఇద్దరు కుమార్తెలు ఉండగా, పెద్ద కుమార్తె కనకమహాలక్ష్మి వివాహం బెంగళూరుకు చెందిన రాఘవేంద్రతో ఇటీవల నిశ్చయించారు.
ఈ క్రమంలో జంగంపల్లి శివారులోని బీటీఎస్ వద్ద ఓ కల్యాణ మండపంలో శుక్రవారం పెద్ద కుమార్తె వివాహ ఏర్పాట్లు వైభవంగా చేశారు. అయితే కన్యాదానం చేసిన కొద్దిసేపటికే వధువు తండ్రి బాల్ చంద్ర కల్యాణ మండపంలోనే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఈ హఠాత్పరిణామంతో అందరూ నిర్ఖాంతపోయారు. కుటుంబ సభ్యులు, బంధువులు వెంటనే ఆయనను జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
పెళ్లి మండపంలోనే వధువు తండ్రి గుండెపోటుతో మృతి చెందడం స్థానికులను దిగ్భాంతికి గురి చేసింది. ఈ ఘటనతో అప్పటి వరకూ బాజా భజంత్రీలు, బంధుమిత్రులతో కళకళలాడిన పెళ్లి మండపంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వధువు కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో పెళ్లి మండపం శోక సంద్రమైంది. ఈ ఘటన చూపరుల హృదయాలను కలచివేసింది.