తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ, తాను అందరికీ నచ్చాలనేమీ లేదని, కొందరికి నచ్చవచ్చు, ఇంకొందరికి నచ్చకపోవచ్చని అన్నారు. తనను ముఖ్యమంత్రిగా కూడా కొందరు అంగీకరించకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, ఎవరూ వేలెత్తి చూపే పరిస్థితి తెచ్చుకోనని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రజలు తననే ప్రశ్నిస్తారని ఆయన అన్నారు. ఇచ్చిన ప్రతి గ్యారెంటీని తప్పకుండా అమలు చేస్తానని ఆయన పునరుద్ఘాటించారు. కొందరు తనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, వారు అంతకు మించి ఏమీ చేయలేరని ఆయన అన్నారు. విమర్శలను పట్టించుకుంటే తాను ముందుకు వెళ్లలేనని ముఖ్యమంత్రి అన్నారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి ప్రస్తావిస్తూ, గతంలో సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ పార్టీ బీఫారంపై గెలిచారో, ఆ తర్వాత ఏ పార్టీలో చేరారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. వారు ఎవరి హయాంలో మంత్రులయ్యారో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పాలని ఆయన నిలదీశారు. మంత్రివర్గ విస్తరణ తన ఒక్కడి నిర్ణయం కాదని ఆయన స్పష్టం చేశారు.