పశువుల కొట్టంలోకి దూసుకెళ్లిన కారు

— మూడు గెదలు మృతి
— ఇద్దరి పరిస్థితి విషమం
— పెళ్లి వేడుకల ప్రయాణం లో విషాదం
రామారెడ్డి మే 04 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల పరిధిలో కారు అదుపు తప్పి పశువుల కొట్టంలోకి దూసుకెళ్లిన ఘటన సోమవారం చోటుచేసుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళితే పెళ్లి వేడుకలు ముగించుకుని కారులో (ఎర్టిగా) TS 17 9294 గల కారు బయలుదేరుతున్న ప్రయాణికులు రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామం లో తెల్లవారు జామున సుమారు 3 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు,స్థానికుల కథనం ప్రకారం గాంధారికి చెందిన అమ్మాయికి మాచారెడ్డి మండలం సోమార్ పేట గ్రామానికి చెందిన అబ్బాయితో సోమార్ పేటలో ఆదివారం వివాహం జరిగింది.వివాహ తంతు పూర్తి చేసుకున్న కుటుంబ సభ్యులు ఎనిమిది మంది ఓ కారులో రామారెడ్డి, ఉప్పల్వాయి మీదుగా ఆదివారం అర్ధరాత్రి తర్వాత గాంధారికి బయలుదేరారు. ఉప్పల్వాయి గ్రామం వద్దకు చేరుకోగానే కారు అదుపుతప్పి కొట్టంలోకి దూసుకెళ్లింది.వేగంగా ఉన్న కారు కొట్టంలో ఉన్న బర్లను బలంగా ఢీకొనడంతో బోల్తాపడింది. ప్రమాదంలో మూడు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరొక గేదెకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెంటనే కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుందని స్థానిక ఎస్సై పి.రాజశేఖర్ తెలిపారు.
