నర్సాపూర్ (ప్రజాజ్యోతి) మండలంలో ఇసుక అక్రమార్కులు సరికొత్త ఎత్తుగడలతో బరితెగిస్తున్నారు. శనివారం రాత్రి రెడ్డిపల్లి వైపు నుంచి కృత్రిమ ఇసుకతో నిండిన స్వరాజ్ ట్రాక్టర్లు చైతన్యపూర్ కాలనీ, సీతారాంపూర్ మీదుగా రుస్తుంపేట గ్రామానికి యథేచ్ఛగా తరలివెళ్ళింది. సంబంధిత అధికారులు లేదా పోలీసులు తనిఖీ చేసినా వాహనాలను గుర్తించకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తగా నెంబర్ ప్లేట్లను కనుమరుగు చేసి ఈ దందాను నడిపిస్తుండటం గమనార్హం. జాతీయ రహదారిపై ఇంత బహిరంగంగా అక్రమ రవాణా సాగుతున్నా, పెట్రోలింగ్ వాహనాలు కానరాకపోవడం అక్రమార్కులకు వరంగా మారింది. యంత్రాంగం పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో, అనుమతులు లేని ఇసుక అక్రమంగా సరిహద్దులు దాటుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అధికారుల కళ్లెదుటే ఈ ‘చీకటి భాగోతం’ సాగుతున్నా చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న మర్మమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
