- వైద్య సేవల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
- జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
- చెన్నారావుపేట పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
- సిబ్బంది తీరుపై సీరియస్
చెన్నారావుపేట, మార్చి 26 (ప్రజా జ్యోతి)::
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రికార్డులను వైద్య సిబ్బంది హాజరు పట్టికను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బంది సమయపాలన పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆసుపత్రి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లోగా ఆసుపత్రి ఆవరణలోని పిచ్చిమొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రం చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఆసుపత్రి లోపల పూర్తిస్థాయిలో శానిటైజేషన్ చేయించి రోగులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని సూచించారు.అలాగే మందుల నిల్వలను పరిశీలించారు. గడువు ముగిసిన మందులను వెంటనే గుర్తించి పక్కన పడేయాలని రోగులకు ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యమైన మందులే అందాలని స్పష్టం చేశారు. అవసరమైన మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డి ఎం హెచ్ ఓ డాక్టర్ సాంబశివరావు, తాసిల్దార్ అబిద్ అలీ, ఇంచార్జ్ ఎంపీడీవో ఆయేషా పర్వీన్,ఆర్ ఐ రషీద్,ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
