సిద్దిపేట రూరల్, మార్చి 14 , (ప్రజాజ్యోతి): అలియన్స్ సిద్దిపేట జిల్లాకు చెందిన గవర్నర్ ఈశ్వర్ చరణ్ పదవీకాలం ఈ నెల మార్చితో ముగియనున్న సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో విజయోత్సవ సమావేశాన్ని జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అలియన్స్ ఇంటర్నేషనల్ ఫౌండర్, మాజీ ప్రెసిడెంట్ బి. తిరుపతి రాజు, వచ్చే ఏడాదికి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన డీబీజీ శాస్త్రి, ఇంటర్నేషనల్ అడ్వైజర్ డా. శ్రీనివాసరావు, సౌత్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ అంజయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడిన అతిథులు గవర్నర్ ఈశ్వర్ చరణ్ తన పదవీకాలంలో అనేక శాశ్వత ప్రాజెక్టులు, పలు సేవా కార్యక్రమాలు చేపట్టి జిల్లా అభివృద్ధికి కృషి చేశారని ప్రశంసించారు. డీబీజీ శాస్త్రి మాట్లాడుతూ జిల్లాలో నూతన క్లబ్బులు స్థాపించడం ద్వారా సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి సంస్థను మరింత బలోపేతం చేశారని తెలిపారు.ఇంటర్నేషనల్ ఫౌండర్ బి. తిరుపతి రాజు మాట్లాడుతూ సంస్థను ఇతర దేశాలలో కూడా విస్తరించే దిశగా నూతన జిల్లాలు, క్లబ్బులు ఏర్పాటు చేస్తున్నామని, దేశంలో కూడా సభ్యత్వాన్ని పెంచుతూ సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని సూచించారు.ఈ సందర్భంగా జిల్లాకు చెందిన కుకునూర్‌పల్లి గ్రామానికి బాడీ ఫ్రీజర్ సేవా పేటికను అతిథుల సమక్షంలో అందజేశారు. జిల్లాలోని క్లబ్బుల మధ్య బ్యానర్ ప్రెజెంటేషన్ కార్యక్రమం నిర్వహించి ఐదు క్లబ్బులను విజేతలుగా ప్రకటించి బహుమతులు అందజేశారు.అవార్డు నైట్‌లో భాగంగా జిల్లాలో అత్యధిక సేవలు అందించిన సభ్యులు, క్లబ్బులకు ప్రత్యేక అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఈశ్వర్ చరణ్ దంపతులు, ఇంటర్నేషనల్ చైర్మెన్లు ఆత్మరాములు, వనజ, మాజీ గవర్నర్లు, తెలంగాణ జిల్లాలకు చెందిన ఇంటర్నేషనల్ అధికారులు, మల్టిపుల్ ఆఫీసర్లు, జిల్లా అధికారులు, క్లబ్ ప్రెసిడెంట్లు, కార్యదర్శులు, కోశాధికారులు తదితరులు పాల్గొన్నారు.
