సిద్ధిపేట , మార్చి 12 ,(ప్రజాజ్యోతి) : గ్రామాభివృద్ధిలో ప్రజాప్రతినిధుల పాత్ర ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అన్నారు. సిద్దిపేట కేంద్రంలోని రెడ్డి సంక్షేమ సంఘ భవనంలో గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై మున్సిపల్ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లు, గ్రామ సర్పంచులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి, జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, వివిధ శాఖల అధికారులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి పంపిన వీడియో సందేశాన్ని ప్రాజెక్టర్ ద్వారా ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులకు పూర్తి అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో విద్య, వైద్యం, పారిశుధ్యం తదితర రంగాల్లో కూడా అనేక అవగాహన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రజా సేవనే పరమ ధ్యేయంగా భావించి సమాజాన్ని దేవాలయంగా గుర్తించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఈ అవగాహన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.జిల్లా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమాన్ని దశలవారీగా అమలు చేస్తున్నామని తెలిపారు. పరిశుభ్రత, ఆరోగ్యం, రోడ్డు భద్రత, రైతు సంక్షేమం, విద్య, యువజన క్రీడలు, మహిళల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గ్రామాభివృద్ధికి ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని, ప్లాస్టిక్ నిషేధం, స్టీల్ బ్యాంక్ ఏర్పాటు, సోలార్ వినియోగం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు.జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా విద్య, వైద్యం, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, పౌరసరఫరాలు, రోడ్డు భద్రత, డ్రగ్స్ నిర్మూలన, శాంతి భద్రతలు, విద్యుత్, పర్యావరణం, ఇందిరమ్మ గృహాలు వంటి అంశాలపై సంబంధిత శాఖల అధికారులు ప్రాజెక్టర్ ద్వారా వివరమైన అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రణాళిక అధికారి దశరథ్, జిల్లా అటవీ శాఖ అధికారి పద్మజా రాణి, అదనపు డీసీపీ కుషాల్కర్, జిల్లా పంచాయతీ అధికారి రవీందర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి జయదేవ్ ఆర్య, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
గ్రామాభివృద్ధిలో ప్రజాప్రతినిధుల పాత్ర ఎంతో కీలకం
Leave a Comment
