- పరిగి మున్సిపల్ చైర్ పర్సన్ గా కుడుముల రజిత

ఇద్దరు ఇండిపెండెంట్ల మద్దతుతో కాంగ్రెస్ కైవసం
పరిగి, ఫిబ్రవరి 16 (ప్రజాజ్యోతి):
పరిగి మున్సిపాలిటీ రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారిన నేపథ్యంలో, మున్సిపల్ చైర్ పర్సన్ గా కాంగ్రెస్ పార్టీ కి అభ్యర్థి కుడుముల రజిత విజయం సాధించారు. ప్రతిపాదకుడిగా మూడవత్ హనుమంతు, బలపరిచిన వ్యక్తిగా ఎండి. అజాజ్ వ్యవహరించారు. ఎన్నికల ఫలితాల వెలువడిన అనంతరం ఉత్కంఠభరితంగా సాగగా, ఇద్దరు ఇండిపెండెంట్ సభ్యులు, ఎక్స్ అఫీషియో గా ఎమ్మెల్యే డా. టి రామ్మోహన్ రెడ్డి మద్దతుతో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది.
ఎన్నికల ఫలితాల అనంతరం పరిధిలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఇరువర్గాలు తమ తమ వ్యూహాలను అమలు చేస్తూ, అభ్యర్థులకు మద్దతు కూడగట్టేందుకు తీవ్రంగా కృషి చేశాయి. ముఖ్యంగా ఇండిపెండెంట్ సభ్యుల మద్దతు కీలకంగా మారడంతో, వారి నిర్ణయం రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చింది.
–వైస్ చైర్మన్‌గా ముడావత్ హనుమంతు
రసవత్తరంగా సాగిన ఎన్నికల ప్రక్రియ మున్సిపల్ వైస్ చైర్మన్‌గా ముడావత్ హనుమంతు ఎన్నికయ్యారు. చైర్మన్ ఎన్నికలతో పాటు వైస్ చైర్మన్ పదవీ ఎన్నిక కూడా ఆసక్తికరంగా సాగింది. స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఎన్నికల ప్రక్రియను ఆసక్తిగా వీక్షించారు.
ఎన్నికల అనంతరం కాంగ్రెస్ శ్రేణులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశాయి. ఇండిపెండెంట్ సభ్యులకు తమ అభివృద్ధి ప్రణాళికలను వివరించి, మద్దతు పొందినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. “పరిగి అభివృద్ధే మా లక్ష్యం” అని నూతన చైర్మన్ కుడుముల రజిత పేర్కొన్నారు.
ఇకపై పరిగి మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించి, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని నూతన పాలకవర్గం స్పష్టం చేసింది. ఎన్నికల ఫలితాలతో పరిగి రాజకీయాల్లో కొత్త అధ్యాయం ఆరంభమైందని స్థానికులలో చర్చగా మారింది.
