సముద్రంలో 4 గంటలు ఈది.. తల్లి, తోబుట్టువులను కాపాడుకున్న 13 ఏళ్ల బాలుడు

V. Sai Krishna Reddy
2 Min Read

ఆస్ట్రేలియాలో సముద్ర తీరంలో కొట్టుకుపోయిన తన తల్లి, ఇద్దరు తోబుట్టువుల ప్రాణాలను కాపాడటానికి 13 ఏళ్ల బాలుడు కొన్ని గంటల పాటు ఈది పెద్ద సాహసం చేశాడు. సముద్రంలో నాలుగు గంటల పాటు ఈదిన బాలుడు ఒడ్డుకు చేరుకుని అధికారులకు తన తల్లి జోవాన్ అప్పెల్బీ (47), సోదరుడు బ్యూ (12), సోదరి గ్రేస్ (8) లు సముద్రంలో చిక్కుకుపోయిన సమాచారాన్ని అందించాడు. అధికారులు హెలికాప్టర్ సాయంతో రంగంలోకి దిగి వారిని కాపాడారు.

పెర్త్‌కు చెందిన జోవాన్ అప్పెల్బీ తన ముగ్గురు పిల్లలతో కలిసి చిన్న పడవలు, పెడల్ బోర్డుల సహాయంతో సముద్రంలో విహారానికి వెళ్లింది. కొద్దిదూరం వెళ్లాక వాతావరణం మారిపోయి సముద్రం అల్లకల్లోలంగా మారి వారు సముద్రానికి దూరంగా కొట్టుకుపోయారు.

ఈ క్రమంలో తల్లి సూచనతో పెద్ద కుమారుడు ఆస్టిన్ అప్పెల్బీ ఓ చిన్న పడవపై తీరం వైపు బయలుదేరాడు. అందులోకి నీరు చేరడంతో దానిని వదిలేశాడు. తనకు ఇబ్బందిగా ఉండటంతో లైఫ్ జాకెట్ కూడా పక్కన పడేసి అలల నడుమ దాదాపు నాలుగు కిలోమీటర్లు ఈది ఒడ్డుకు చేరుకున్నాడు. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా అధికారులు హెలికాప్టర్ సాయంతో అతని కుటుంబం కోసం గాలింపు చేపట్టారు.

ఆ సమయానికి వారు తీరానికి 14 కిలోమీటర్ల దూరం వెళ్లిపోయారు. పెడల్ బోర్డులను పట్టుకుని వేలాడుతూ కనిపించిన వారిని సురక్షితంగా తీసుకువచ్చారు. నలుగురికి వైద్య పరీక్షలు చేయగా, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.

భారీ అలల నడుమ ఈత కొడుతూ తాను ఒడ్డుకు చేరుకున్నానని ఆస్టిన్ తెలిపాడు. 13 ఏళ్ల బాలుడు పెద్ద సాహసం చేశాడని పోలీసు అధికారి జేమ్స్ బ్రాడ్లీ అన్నారు. అతని సాహసం, సంకల్పం తన తల్లి, సోదరులను కాపాడిందని అన్నారు.

తామంతా సముద్రంలో చిక్కుకుపోవడంతో తాను వారిని వదిలి వెళ్లలేని పరిస్థితుల్లో పెద్ద కుమారుడిని ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకోమని సూచించానని తల్లి జోవాన్ తెలిపారు. ఆస్టిన్‌ను ఒక్కడినే పంపించడం తన జీవితంలో తీసుకున్న అత్యంత కఠిన నిర్ణయమని పేర్కొన్నారు. సముద్రంలో కొట్టుకుపోయిన మొదట్లో ధైర్యంగా ఉన్నప్పటికీ చీకటి పడే కొద్దీ అలలు ఉద్ధృతంగా మారడంతో ఆందోళన కలిగిందని అన్నారు. తన ముగ్గురు పిల్లలు బతికి బయటపడ్డారు అది చాలని అన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *