అమెరికాలో చైనా అధ్యక్షుడి కూతురి రహస్య జీవితం

V. Sai Krishna Reddy
3 Min Read

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ప్రముఖ గాయని పెంగ్ లియువాన్‌ల ఏకైక కుమార్తె షీ మింగ్‌జె జీవితం మొదటి నుంచీ అత్యంత రహస్యంగా సాగుతోంది. చైనా ప్రభుత్వం ఆమె ఉనికిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తోంది. బహిరంగ కార్యక్రమాల్లో ఆమె కనిపించడం చాలా అరుదు, మీడియాలో కూడా ఆమె గురించి వార్తలు రాకుండా కఠినమైన నియంత్రణలు ఉంటాయి. అయితే, ఆశ్చర్యకరంగా, షీ జిన్‌పింగ్ కుమార్తె తన ముఖ్యమైన విద్యా సంవత్సరాలను అమెరికాలోనే గడపడం ఇప్పుడు ఒక భౌగోళిక రాజకీయ వైరుధ్యంగా కనిపిస్తోంది. ఎవరి కంటా పడకుండా, చైనా సైనిక దళాలతో సంబంధం ఉన్న భద్రతా సిబ్బంది పర్యవేక్షణలో ఆమె అమెరికాలో చదువుకున్నట్లు తెలుస్తోంది.

విదేశాల్లో చదవడం హోదా చిహ్నం
షీ మింగ్‌జె తన విద్యా ప్రస్థానాన్ని 2006 నుంచి 2008 వరకు హాంగ్‌జౌ ఫారిన్ లాంగ్వేజ్ స్కూల్‌లో ఫ్రెంచ్ అభ్యసించడంతో ప్రారంభించారు. ఆ తర్వాత కొంతకాలం జెజియాంగ్ విశ్వవిద్యాలయంలో కూడా చదివారు. చైనాలోని అనేక రాజకీయ ఉన్నత కుటుంబాల పిల్లల మాదిరిగానే, ఆమెను కూడా విదేశీ విద్య కోసం, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదివించడం కోసం సిద్ధం చేశారు. ఇది వారికి ఒక హోదా చిహ్నంగా కూడా పరిగణిస్తారు.

మారుపేరుతో హార్వర్డ్ లో ప్రవేశం..
ఈ క్రమంలో 2010లో షీ మింగ్‌జె మారుపేరుతో అమెరికాలోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చేరారు. చైనా ఉన్నతాధికారుల కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉన్నప్పుడు తమ గోప్యత, భద్రత కోసం ఇలా మారుపేర్లు ఉపయోగించడం సాధారణం. ఆమె 2014లో సైకాలజీలో పట్టా పొందారు. క్యాంపస్‌లో ఆమె ఉనికి బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చైనా సైన్యానికి చెందిన భద్రతా సిబ్బంది ఆమెకు రక్షణ కల్పించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

ట్రంప్ హయాంలోనూ అమెరికాలోనే..
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై, చైనాను అమెరికాకు అతిపెద్ద ముప్పుగా చిత్రీకరిస్తూ ప్రచారం చేయడానికి కొద్ది కాలం ముందే షీ మింగ్‌జె అమెరికాలో తన చదువును పూర్తిచేశారు. అయితే 2019 ప్రాంతంలో ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుల కోసం మళ్లీ హార్వర్డ్‌కు తిరిగి వచ్చారనే పుకార్లు వ్యాపించాయి. అప్పటికే ట్రంప్ ప్రభుత్వం చైనాతో వాణిజ్య యుద్ధంలో పూర్తిగా మునిగిపోయింది. పరిశోధనా వీసాలపై కోత విధించడం, చైనా టెక్ సంస్థలను బ్లాక్‌లిస్ట్ చేయడం, అమెరికా క్యాంపస్‌లలో గూఢచర్యం జరుగుతోందని హెచ్చరించడం వంటి చర్యలు తీసుకుంటోంది.

2014 లోనే చైనా యువరాణి గ్రాడ్యుయేషన్ పూర్తి
చైనా అధ్యక్షుడి కుమార్తె మారుపేరుతో మసాచుసెట్స్‌లో చదువుకుంటున్న సమయంలోనే, ట్రంప్ అధికారులు చైనా పండితులు అమెరికా విద్యాసంస్థల్లోకి చొరబడుతున్నారని ఆరోపించడం ఒకరకంగా వింతైన పరిస్థితి. బీజింగ్ ప్రభావాన్ని పశ్చిమ దేశాల్లో అరికట్టాలని గట్టిగా వాదించిన అధ్యక్షుడి హయాంలోనే, చైనాకు చెందిన అత్యంత ఉన్నత స్థాయి వ్యక్తి అక్కడ చదువుకోవడం గమనార్హం. అయితే, షీ మింగ్‌జె 2019లో హార్వర్డ్‌కు తిరిగి వచ్చారా లేదా అనే విషయాన్ని బీజింగ్ గానీ, వాషింగ్టన్ గానీ అధికారికంగా ఎప్పుడూ ధృవీకరించలేదు. కానీ ఈ ఊహాగానాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీతో లేదా సున్నితమైన పరిశోధనా రంగాలతో సంబంధం ఉన్న చైనా జాతీయులను లక్ష్యంగా చేసుకుని తాజాగా వీసా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి.

అత్యంత గోప్యంగా విద్యాభ్యాసం
కొన్ని దశాబ్దాలుగా, పాశ్చాత్య విశ్వవిద్యాలయాలు, ముఖ్యంగా యూకే మరియు అమెరికాలోని వర్సిటీలు చైనా రాజకీయ ప్రముఖుల పిల్లలకు విద్యాభ్యాస కేంద్రాలుగా మారాయి. డెంగ్ జియావోపింగ్ వారసుల నుంచి షీ జిన్‌పింగ్ కుమార్తె వరకు, ఐవీ లీగ్ విద్య కేవలం అకడమిక్ ప్రతిభకు మించి, సామాజిక గుర్తింపు మరియు వ్యూహాత్మక ఆస్తిగా పరిగణిస్తున్నారు. తండ్రి అత్యున్నత పదవిలో ఉండటంతో షీ మింగ్‌జె హార్వర్డ్‌లో ఉన్నంతకాలం ఆమె గుర్తింపును అత్యంత రహస్యంగా ఉంచారు. మారుపేరు వాడటం, మీడియాను అనుమతించకపోవడం, అదనపు భద్రత కల్పించడం ద్వారా ప్రపంచంలో కొద్దిమంది ప్రముఖులకు మాత్రమే సాధ్యమయ్యే గోప్యతను ఆమె పొందగలిగారు.

మింగ్‌జె ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?
షీ మింగ్‌జె ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే విషయంపై స్పష్టత లేదు. ఆమె ఇప్పటికీ మసాచుసెట్స్‌లోనే దౌత్యపరమైన లేదా ప్రభుత్వ రక్షణలో నివసిస్తున్నారని కొన్ని నివేదికలు సూచిస్తుండగా, గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత బీజింగ్‌కు తిరిగి వెళ్లిపోయారని మరికొందరు అంటారు. ఇరు దేశాలు దీనిపై అధికారికంగా ఎలాంటి వ్యాఖ్య చేయకపోవడంతో షీ మింగ్‌జె ఇప్పుడు ఎక్కడ ఉన్నారనే విషయంపై స్పష్టత లేదు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *