ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్ల పనితీరుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రజలకు అత్యంత కీలకమైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన అనుమతుల మంజూరు ప్రక్రియలో నిర్లక్ష్యం తగదని అన్నారు.
లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని, జూన్ 6వ తేదీలోగా అర్హులైన వారి పూర్తి జాబితాను తయారు చేయాలని ఆయన గడువు విధించారు. కేవలం జాబితా మాత్రమే కాకుండా, సంబంధిత ప్రొసీడింగ్స్ కాపీలను కూడా జతచేసి అందించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు.
అదేవిధంగా, వ్యవసాయ సీజన్ సమీపిస్తున్న తరుణంలో రైతులను తీవ్రంగా నష్టపరిచే నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువుల బెడదపై కూడా మంత్రి దృష్టి సారించారు. ఎవరైనా నకిలీ విత్తనాలు లేదా ఎరువులు విక్రయిస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ నకిలీ దందాను సమర్థవంతంగా అరికట్టేందుకు పోలీస్ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.