ఉత్కంఠ పోరులో పంజాబ్ చిత్తు.. ఈ సీజన్‌ను గెలుపుతో ముగించిన‌ ఢిల్లీ

V. Sai Krishna Reddy
3 Min Read

ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌ బెర్తులు దక్కించుకున్న జట్లకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ)కు సన్‌రైజర్స్‌ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) షాక్‌ ఇవ్వగా, తాజాగా పంజాబ్‌ కింగ్స్ (పీబీకేఎస్‌) టాప్‌ ప్లేస్ ఆశ‌ల‌పై ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) నీళ్లు చ‌ల్లింది. ఢిల్లీపై గెలిచి అగ్రస్థానంలోకి దూసుకెళుదామనుకున్న పంజాబ్‌కు దిమ్మతిరిగే షాక్ త‌గిలింది. శనివారం జైపూర్ వేదిక‌గా జరిగిన మ్యాచ్‌లో డీసీ ఆరు వికెట్ల తేడాతో పంజాబ్‌పై సూప‌ర్ విక్ట‌రీని న‌మోదు చేసింది.

పీబీకేఎస్‌ నిర్దేశించిన 207 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ 19.3 ఓవర్లలో 208/4 స్కోరు చేసింది. సమీర్‌ రిజ్వి(25 బంతుల్లో 58 నాటౌట్‌), కరణ్‌నాయర్ (44), కేఎల్‌ రాహుల్‌(35) అద్భుతంగా రాణించారు. బ్రార్‌(2/41)కు రెండు వికెట్లు దక్కాయి. తొలుత కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌(34 బంతుల్లో 53), స్టోయినిస్‌(16 బంతుల్లో 44 నాటౌట్‌) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 206/8 స్కోరు చేసింది. రెహమన్‌(3/33) మూడు వికెట్లతో రాణించాడు.

కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన‌ అయ్యర్‌.. ఆఖ‌ర్లో అద‌ర‌గొట్టిన‌ స్టోయినిస్‌
లీగ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న యువ ఓపెన‌ర్ ప్రియాంశ్‌ ఆర్య(6) స్వల్ప స్కోరుకే వెనుదిరుగడంతో పంజాబ్‌కు సరైన శుభారంభం దక్కలేదు. ఫస్ట్‌డౌన్‌లో వచ్చిన ఇంగ్లిస్‌(32), ప్రభ్‌సిమ్రన్‌సింగ్‌(28) పంజాబ్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వచ్చి రావడంతోనే ఇంగ్లిస్‌… ఢిల్లీ బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అయితే, స్పిన్న‌ర్‌ విప్రాజ్‌ నిగమ్ వేసిన ఓ అద్భుత‌మైన బంతికి ఇంగ్లిస్ బోల్తా కొట్టాడు. తొలి రెండు బంతులను బౌండరీలుగా మలిచిన ఇంగ్లిస్‌… నిగమ్‌ వేసిన ఓ గూగ్లీని సరిగ్గా అర్థం చేసుకోకుండా ముందుకెళ్లి ఆడే ప్రయత్నంలో స్టంపౌట్‌ అయ్యాడు.

ఆ తర్వాత 20 పరుగుల తేడాతో ప్రభ్‌సిమ్రన్‌ కూడా నిగమ్‌కు వికెట్‌ సమర్పించుకున్నాడు. ఈ దశలో అయ్యర్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మధ్యలో రెహమన్‌ ధాటికి శశాంక్‌(11), వదేరా(16) వెంట‌వెంట‌నే వికెట్లు పారేసుకున్నారు. ఆఖర్లో స్టోయినిస్‌ మెరుపులతో అదరగొట్టాడు. మోహిత్ శర్మను లక్ష్యంగా చేసుకుంటూ ఒకే ఓవర్లో 22 పరుగులు రాబ‌ట్టాడు. ఈ క్రమంలో 16 బంతుల్లోనే 3ఫోర్లు, 4 భారీ సిక్స్‌లతో 44 పరుగుల‌తో అజేయంగా నిలిచాడు.

సమీర్‌ రిజ్వి ధనాధన్ ఇన్నింగ్స్.. రాణించిన కరుణ్ నాయ‌ర్‌
ఓపెనర్లు రాహుల్‌(35), కెప్టెన్‌ డుప్లెసిస్‌(23) తొలి వికెట్‌కు 55 పరుగులు జతచేశారు. వీరిద్దరు పంజాబ్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. అయితే, యన్సెన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడబోయిన రాహుల్‌… శశాంక్‌ చేతికి చిక్కాడు. ఆ తర్వాత 10 పరుగుల తేడాతో డుప్లెసిస్‌ను బ్రార్‌ రెండో వికెట్‌గా పెవిలియన్‌ పంపాడు. కరణ్‌నాయర్‌, అటల్‌(22) ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ సింగిల్స్‌తో స్ట్రైక్‌ రొటేట్‌ చేశారు.

ఈ క్ర‌మంలో బ్రార్‌ బౌలింగ్‌లో క‌రుణ్‌ నాయర్ (44) క్లీన్‌బౌల్డ్‌ కాగా, దూబే బౌలింగ్‌లో అటల్ పెవిలియ‌న్ చేరాడు. దీంతో ఢిల్లీ గెలుపుపై ఆశలు సన్నగిల్లుతున్న వేళ సమీర్‌ రిజ్వి, స్టబ్స్ ఒక్క‌సారిగా సమీకరణాలను తారుమారు చేశారు. భారీ షాట్ల‌తో రెచ్చిపోయిన రిజ్వి అజేయ అర్ధ సెంచరీ (58)తో ఢిల్లీకి అద్భుత విజయాన్ని అందించాడు. పంజాబ్‌కు ఊహించ‌ని షాక్‌ ఇచ్చిన ఢిల్లీ ఈ సీజన్‌ను మంచి గెలుపుతో ముగించింది. ఆఖ‌ర్లో ధనాధన్ ఇన్నింగ్స్‌తో డీసీకి విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టిన‌ రిజ్వికి ‘ప్లేయ‌ర్‌ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *