కరోనా మహమ్మారి పూర్తిగా అంతమైందని భావిస్తున్న తరుణంలో, దేశంలో మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నాయి.
భారత్‌లో కొవిడ్ కొత్త వేరియంట్లు ఎన్‌బీ.1.8.1, ఎల్‌ఎఫ్.7లను గుర్తించినట్లు ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం (ఇన్సాకాగ్) శనివారం ప్రకటించింది. ఎన్‌బీ.1.8.1 రకం కేసు ఏప్రిల్ నెలలో వెలుగు చూడగా, ఎల్‌ఎఫ్.7 వేరియంట్‌కు సంబంధించిన నాలుగు కేసులు మే నెలలో తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో నమోదైనట్లు సంస్థ తెలిపింది.
ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఢిల్లీలో మూడేళ్లలో తొలిసారిగా 23 మందికి వైరస్ సోకింది. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆసుపత్రులను అప్రమత్తం చేశాయి. అయితే, కేసులు నమోదవుతున్నప్పటికీ, వ్యాధి తీవ్రత తక్కువగానే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ ఇటీవల వెల్లడించింది. అయినప్పటికీ, పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపింది.
అంతర్జాతీయంగా పెరుగుతున్న వ్యాప్తి
ఇటీవలి కాలంలో ఆసియా దేశాలైన హాంకాంగ్, సింగపూర్, థాయ్‌లాండ్‌తో పాటు చైనాలోనూ కొవిడ్-19 వ్యాప్తి అధికంగా ఉంది. వారానికి వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. జేఎన్.1 వేరియంట్, దాని ఉపరకాలే ఈ వ్యాప్తికి ప్రధాన కారణంగా అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా జేఎన్.1 ఉపరకాలైన ఎల్‌ఎఫ్.7, ఎన్‌బీ.1.8 వేరియంట్ల వ్యాప్తి ఎక్కువగా ఉందని సింగపూర్ ఆరోగ్యశాఖ ఇటీవల వెల్లడించింది. బాధితుల్లో జ్వరం, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి, నీరసం వంటి స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయని, వారు నాలుగు రోజుల్లోనే కోలుకుంటున్నారని వైద్య నిపుణులు తెలియజేశారు.
ప్రభుత్వాల చర్యలు, నిపుణుల సూచనలు
ఢిల్లీలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, టెస్టింగ్ కిట్లు, వ్యాక్సిన్ల లభ్యతను సరిచూసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. వివిధ రకాల శ్వాసకోశ వైరస్ కేసుల వివరాలను నమోదు చేయాలని కూడా సూచించింది. వైరస్ వేరియంట్లలో వస్తున్న మార్పులు, ప్రజల్లో రోగనిరోధక శక్తి తగ్గడం ప్రస్తుత వ్యాప్తికి కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు.