హైదరాబాద్ నగరంలో ఆదివారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో భారీ అగ్నిప్రమాదాలు తీవ్ర కలకలం రేపాయి. చార్మినార్ వద్ద గుల్జార్ హౌస్ లో జరిగిన ఘోర దుర్ఘటనలో 17 మంది సజీవ దహనం కాగా, మైలార్‌దేవ్‌పల్లిలో జరిగిన మరో ప్రమాదంలో 53 మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. ఈ రెండు ఘటనలతో నగరవాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
మైలార్‌దేవ్‌పల్లిలో తప్పిన పెను ముప్పు… 53 మంది సేఫ్
నగర శివార్లలోని మైలార్‌దేవ్‌పల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. ఇక్కడ ఒక మూడంతస్తుల భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో భవనంలో సుమారు 53 మంది నివసిస్తున్నారు. భవనం నుంచి కిందకు దిగే ప్రధాన మెట్ల మార్గం వద్దే మంటలు భారీగా ఎగిసిపడటంతో వారంతా పై అంతస్తుల్లో చిక్కుకుపోయారు. ప్రాణభయంతో టెర్రస్‌పైకి చేరుకుని ఆర్తనాదాలు చేశారు.
విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి, లాడర్ల సహాయంతో టెర్రస్‌పై ఉన్నవారిని సురక్షితంగా కిందకు దించారు. రెండో అంతస్తులో చిక్కుకున్న మరికొందరిని మెట్ల మార్గం ద్వారా కిందకు తీసుకొచ్చారు. అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి, భవనంలో చిక్కుకున్న మొత్తం 53 మందిని ప్రాణాలతో కాపాడారు. వీరిలో 20 మంది చిన్నపిల్లలు కూడా ఉండటం గమనార్హం. సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తేవడంతో పెను ప్రమాదం తప్పిందని, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.