ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ: పెట్టుబడులకు సీఎం రేవంత్ పిలుపు

V. Sai Krishna Reddy
2 Min Read

తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం జపాన్‌లో పర్యటిస్తోంది. ప్రతిష్ఠాత్మక ఒసాకా వరల్డ్ ఎక్స్‌పో 2025లో పాల్గొన్న తొలి భారత రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించారు. ఎక్స్‌పోలోని భారత పెవిలియన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ తెలంగాణ జోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఒసాకా ఎక్స్‌పో వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు గల అపార అవకాశాలను వివరించారు. సులభతర పారిశ్రామిక విధానం, స్థిరమైన ప్రభుత్వం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు తెలంగాణకు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. “హైదరాబాద్‌కు రండి, మీ ఉత్పత్తులను ఇక్కడ తయారు చేయండి. భారత మార్కెట్‌తో పాటు ప్రపంచ దేశాలకు తెలంగాణను ఉత్పత్తి కేంద్రంగా మార్చుకోండి” అంటూ జపాన్ కంపెనీలను సీఎం సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ, జపాన్ మధ్య చారిత్రక స్నేహ బంధాన్ని బలమైన భాగస్వామ్యంగా మార్చుకుందామని, నూతన ఆవిష్కరణలతో భవిష్యత్తుకు బాటలు వేద్దామని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సీఎం వివరించారు. హైదరాబాద్‌లో 30,000 ఎకరాల విస్తీర్ణంలో ‘ఫ్యూచర్ సిటీ’ నిర్మిస్తున్నామని, ఇది పర్యావరణ హితం, ఇంధన సామర్థ్యం, స్మార్ట్ మొబిలిటీ, సర్క్యులర్ ఎకానమీకి కేంద్రంగా ఎదుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా జపాన్‌కు చెందిన మరుబెని కార్పొరేషన్‌తో కలిసి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ చుట్టూ నిర్మిస్తున్న 370 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్ మధ్య ప్రాంతంలో ఎలక్ట్రిక్ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఏరోస్పేస్ పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అంతర్జాతీయ ఎగుమతుల కోసం సమీప ఓడరేవుతో అనుసంధానించే డ్రై పోర్టును కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. మూసీ నది పునరుజ్జీవనంలో భాగంగా 55 కిలోమీటర్ల మేర అర్బన్ గ్రీన్ వే అభివృద్ధికి టోక్యో, ఒసాకా నగరాల అనుభవాలు స్ఫూర్తినిస్తాయని అభిప్రాయపడ్డారు.

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఐటీ, బయోటెక్నాలజీ రంగాల్లో తెలంగాణ ఇప్పటికే తనదైన ముద్ర వేసిందని, ఇప్పుడు ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్ వంటి రంగాల్లోనూ పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని తెలిపారు. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ జయేశ్ రంజన్ మాట్లాడుతూ, యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ’ని ఏర్పాటు చేశామని, ఇది ఉపాధి, వ్యాపార అవకాశాలను పెంచుతుందని అన్నారు.

ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్ ద్వారా రాష్ట్ర సాంస్కృతిక వైభవం, పర్యాటక ఆకర్షణలు, పారిశ్రామిక ప్రగతిని ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. ఈ వేదిక ద్వారా పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *