డివైడర్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ దుర్మరణం
– 15 ప్రయాణికులు సురక్షితం
కామారెడ్డి జిల్లా జుక్కల్ చౌరస్తా సమీపంలోని 161వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
కామారెడ్డి డోంగ్లీ సెప్టెంబర్ 04 (ప్రజాజ్యోతి)
చౌరస్తా సమీపంలోని 161వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బిచ్కుంద వైపు వెళ్తున్న హైదరాబాద్-1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జుక్కల్ మండలంలోని కౌలాస్ చౌరస్తా సమీపంలో అదుపుతప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తా పడటంతో డ్రైవర్ డి. ఆంజనేయులు సీటు కింద చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో కండక్టర్కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వారికి ఎలాంటి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు.ప్రమాదానికి సుమారు 200 మీటర్ల ముందునుంచే బస్సు అదుపుతప్పి వంకరగా వెళ్తుండటాన్ని ప్రయాణికులు గమనించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు కేకలు వేసినట్లు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. బస్సును పైకి లేపి డ్రైవర్ ఆంజనేయులు మృతదేహాన్ని బయటకు తీశారు. ప్రమాదంలో బస్సు బోల్తా పడటంతో పాటు ముందు రెండు టైర్లు కూడా విడిపోయాయి. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై బాన్సువాడ డీఎస్పీ విట్టల్ రెడ్డి,బిచ్కుంద సీఐ రవికుమార్, ఘటనాస్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. ఘోర ప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
