కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల రద్దు యత్నాన్ని విరమించుకోవాలి: కొప్పుల మహేష్ రెడ్డి
పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి అండగా నిలిచిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపణ



పరిగి, ఆగస్టు 17 (ప్రజాజ్యోతి): కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా పరిగి బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక భరోసాకు ప్రతీకగా నిలిచిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తిగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. హైకోర్టు తీర్పును సాకుగా చూపుతూ లక్షలాది పేద కుటుంబాలకు అండగా నిలిచిన ఈ పథకాలను ఎత్తివేసేందుకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తోందని విమర్శించారు.
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాకుండా తెలంగాణ పేద కుటుంబాల ఆడబిడ్డల భవిష్యత్తు, ఆత్మగౌరవంతో ముడిపడిన కార్యక్రమాలని అన్నారు. రూ.51 వేల ఆర్థిక సహాయంతో ప్రారంభమైన ఈ పథకాన్ని దశలవారీగా రూ.75,116కు, అనంతరం రూ.1,00,116కు పెంచినట్లు గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో సుమారు 13 లక్షల మంది ఆడబిడ్డల కుటుంబాలకు రూ.13 వేల కోట్ల మేర ఆర్థిక సహాయం అందిందని తెలిపారు.
కోవిడ్ వంటి తీవ్రమైన ఆర్థిక సంక్షోభ సమయంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి ద్వారా పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచిందని అన్నారు. అయితే ఎన్నికల సమయంలో కళ్యాణలక్ష్మితో పాటు ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాన్ని బలోపేతం చేయాల్సింది పోయి రద్దు చేసే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పెళ్లిళ్లు జరిగి చాలా కాలం గడిచినా, కొందరికి పిల్లలు పుట్టినా కూడా తమకు రావాల్సిన కళ్యాణలక్ష్మి సహాయం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. చాలా కాలం తర్వాత ఆమోదం పొందిన దరఖాస్తులకు సంబంధించిన చెక్కులు కూడా పూర్తిస్థాయిలో పంపిణీ కాకుండా నిలిచిపోయాయని ఆరోపించారు. పెండింగ్లో ఉన్న అన్ని అర్హులైన దరఖాస్తులను వెంటనే పరిష్కరించి ఆర్థిక సహాయాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
హైకోర్టు పరిధిలో ఉన్న ఈ అంశంపై ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఆక్షేపణీయమని తెలుపుతూ, నాలుగుసార్లు గడువు ఇచ్చినా ప్రభుత్వం కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. పేదింటి ఆడబిడ్డల ప్రయోజనాలకు సంబంధించిన కీలక అంశంలో ప్రభుత్వం సరైన వాదనలు ఎందుకు వినిపించలేకపోయిందని నిలదీశారు.
ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఆంజనేయులు, మాజీ ఏయంసి చైర్మన్ సురేందర్, మాజీ ఎంపిపి అరవింద్ రావు పంతులు కౌన్సిలర్లు మీర్ తాహేర్ అలీ, జాక్ రవికుమార్, వారల రవీందర్ తోపాటు వివిధ మండలాల నాయకులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, పలు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
