సిద్ధిపేట అర్బన్ , మార్చి 16 , (ప్రజాజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలలో జరుగుతున్నఆలస్యం కారణంగా అధ్యాపకులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిద్దిపేటలోని ఇందూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వి.పి. రాజు తెలిపారు.సోమవారం ప్రజావాణి కార్యక్రమములో కాలేజీలకు చెల్లించాల్సిన బకాయిలు విడుదల చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ , అదనపు కలెక్టర్లకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ఐదు నెలలుగా జీతాల చెల్లింపులు ఆలస్యమవడంతో కుటుంబ పోషణ, ఇంటి అద్దె, పిల్లల విద్య, వైద్య ఖర్చులు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.సమస్య తీవ్రతను తెలియజేయడానికి అధ్యాపకులు బయోమెట్రిక్ హాజరు నమోదు, పరిపాలనా విధులను తాత్కాలికంగా నిలిపివేసి విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా తరగతి బోధన మాత్రమే కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి యాజమాన్యం ద్వారా అధ్యాపకుల జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ నెలాఖరు వరకు సమస్య పరిష్కారం కాకపోతే ఏప్రిల్ 1 నుంచి తరగతులు బహిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, టీచింగ్, నాన్ టీచింగ్ , సిబ్బంది పాల్గొన్నారు.
