సిద్దిపేట, మార్చి 13 (ప్రజాజ్యోతి): రాష్ట్రంలో హిందూ ముస్లింలు గంగా–యమున తహజీబ్‌లా కలిసిమెలిసి సోదరభావంతో జీవించాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన గనుల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఈద్గా మైదానంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ముస్లింల అవసరాల కోసం ప్రతి ప్రాంతంలో షాది ఖానాలు, కబరిస్తాన్ల ఏర్పాటుకు ఒక్కో ప్రాంతానికి 50 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు . సిద్దిపేటలో కబరిస్తాన్ సమస్యను ముస్లిం పెద్దలు ప్రస్తావించగా అనువైన స్థలాన్ని గుర్తించాలని ఆర్డీవో సదానందానికి ఆదేశించినట్లు తెలిపారు. ముస్లింలకు కుట్టు మిషన్లు అందజేస్తామని కూడా హామీ ఇచ్చారు.అంతకుముందు బాబు జగ్జీవన్‌రామ్ భవనంలో జరిగిన కార్యక్రమంలో సిద్దిపేట నియోజకవర్గంలోని ఐదు మండలాల లబ్ధిదారులకు రూ.3 కోట్ల 42 లక్షల 39 వేల విలువైన 342 కల్యాణ లక్ష్మి ,షాది ముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం వేగంగా అమలవుతోందని, లబ్ధిదారులకు బిల్లులు వెంటనే చెల్లిస్తున్నామన్నారు . కొత్త రేషన్ కార్డులు అందజేశామని, త్వరలో అర్హులకు వృద్ధాప్య పెన్షన్లు కూడా మంజూరు చేయనున్నట్లు తెలిపారు.13 వేల కోట్ల రూపాయాలతో నిరుపేదలకు సన్న బియ్యం అందిస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 119 అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాలు ఏర్పాటు చేసి యువతకు శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. సిద్దిపేట మున్సిపాలిటీలో రూ.18 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఆర్డీవో సదానందం, మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, నాయకులు పూజల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సోదరభావంతో జీవించాలి
ఇఫ్తార్ విందులో మంత్రి వివేక్ వెంకటస్వామి
Leave a Comment
