(వెల్దుర్తి ప్రజా జ్యోతి జనవరి 14)
వెల్దుర్తి గ్రామపంచాయతీలో స్థానిక సర్పంచ్ దండెం ఆదర్శ్ సేవాభావం మరోసారి ప్రశంసలు అందుకుంటోంది.బుధవారం గ్రామపంచాయతీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు వేతనాల ఆలస్యం తలెత్తడంతో, అధికారిక నిధుల కోసం ఎదురుచూడకుండా తన సొంత నిధుల నుంచి రూ.95,000 రూపాయలను వెచ్చించి కార్మికులకు వేతనాలు పంపిణీ చేశారు.గ్రామ శుభ్రత, పారిశుధ్యం, అభివృద్ధి పనుల్లో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులు వేతనాల కోసం ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో సర్పంచ్ ఆదర్శ్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కార్మికుల కష్టాలను దగ్గర నుంచి తెలుసుకుని, వారిపై ఉన్న బాధ్యతతోనే ఈ చర్యకు పూనుకున్నానని ఆయన పేర్కొన్నారు.సర్పంచ్ తీసుకున్న ఈ నిర్ణయంతో గ్రామపంచాయతీ కార్మికుల్లో ఆనందం వెల్లివిరిసింది. మా సమస్యను అర్థం చేసుకుని సొంత డబ్బులతో వేతనాలు ఇచ్చిన సర్పంచ్‌కు కృతజ్ఞతలు అంటూ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.ప్రజాప్రతినిధులు కేవలం మాటలకే పరిమితం కాకుండా, కష్టకాలంలో కార్మికుల పక్షాన నిలవాలని సర్పంచ్ దండెం ఆదర్శ్ చేసిన ఈ కార్యక్రమం ఆదర్శంగా నిలుస్తుందని గ్రామ ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఇది నిజమైన ప్రజాసేవకు నిదర్శనమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు
