బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర ఒక్కరోజులో రూ. 3 వేలకు పైగా పెరిగి రూ. 1,31,500కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,17,000 పైన పలుకుతోంది. కిలో వెండి ధర ఒక్కరోజులో రూ. 10 వేలకు పైగా పెరిగి రూ. 1,71,300కు చేరుకుంది. ఇటీవలి కాలంలో దాదాపు స్థిరంగా ఉన్న బంగారం ధరలు, తాజాగా మరోసారి పెరుగుతూ ఉండడం గమనార్హం.
అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 4,200 డాలర్లను దాటి 4,218 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ఔన్సు ధర 54.10 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
అమెరికా చరిత్రలో అత్యధిక కాలం పాటు కొనసాగిన ప్రభుత్వ షట్‌డౌన్ ముగియడంతో ఆర్థిక కార్యకలాపాలు యథావిధిగా కొనసాగనున్నాయి. ముఖ్యంగా ఆర్థిక గణాంకాలు వెలువడటంతో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత విధించే అవకాశం ఉంది. ఈ కారణంగానే బంగారం ధరలు పెరుగుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు
