రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో టోర్నీ నుంచి తప్పుకోవడంతో, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పగ్గాలు అందుకున్న మహేంద్ర సింగ్ ధోనీ తన కెప్టెన్సీ నైపుణ్యాన్ని బయటికి తీశాడు. ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో బౌలర్లను సమర్థంగా ఉపయోగించుకున్నాడు. దాంతో సొంతగడ్డపై లక్నో జట్టు ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 166 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో మతీశ పతిరణ 2, రవీంద్ర జడేజా 2, ఖలీల్ అహ్మద్ 1, అన్షుల్ కాంభోజ్ 1 వికెట్ తీశారు.
పతిరణ విసిరిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో లక్నో జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. ఆ ఓవర్లో తొలుత అబ్దుల్ సమద్ (20) రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత పతిరణ లక్నో కెప్టెన్ పంత్ ను, శార్దూల్ ఠాకూర్ (6) లను అవుట్ చేశాడు.
పంత్ లక్నో జట్టులో టాప్ స్కోరర్. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ 49 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 63 పరుగులు చేశాడు. ఓపెనర్ మిచెల్ మార్ష్ 30, ఆయుష్ బదోనీ 22 పరుగులు చేశారు. మరో ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ (6), నికోలాస్ పూరన్ (8) విఫలమయ్యారు.