ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే నోటిఫికేషన్ వచ్చింది. జనసేన పార్టీ నుంచి నాగబాబుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో, ఎమ్మెల్సీగా నాగబాబు నామినేషన్ కు అవసరమైన పత్రాలను జనసేన వర్గాలు సిద్ధం చేస్తున్నాయి. తాజాగా, ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 10 మంది జనసేన ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. సంతకాలు చేసిన వారిలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, పంతం నానాజీ, లోకం నాగమాధవి, ఆరణి శ్రీనివాసులు, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్, పత్సమట్ల ధర్మరాజు, అరవ శ్రీధర్, బత్తుల బలరామకృష్ణ ఉన్నారు.