మెట్రో స్టేషన్లలో రోడ్డుకు ఓ వైపు నుంచి మరో వైపుకు వెళ్లేందుకు మెట్లు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే అవి మెట్రో ప్రయాణికుల కోసమే కాదని హైదరాబాద్ మెట్రో అధికారులు తెలిపారు. వాటిని నగర ప్రజలు ఎవరైనా ఉపయోగించుకోవచ్చునని తెలిపారు. మెుత్తం 57 స్టేషన్లలో రోడ్డు దాటేందుకు ప్రజలకు అనుమతి ఉందని ఇబ్బందులు పడకుండా రోడ్డు దాటాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. రెప్పపాటు కాలంలోనే వాహనాలు రోడ్లపైకి దూసుకొస్తుంటాయి. కాలి నడకన వెళ్లేవారు రోడ్డుకు ఓ పైపు నుంచి మరోవైపుకు వెళ్లాలంటే ప్రమాదంతో కూడిన సాహసమే చేయాలి. కొన్ని ఏరియాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఉన్నా.. మరికొన్ని చోట్ల మాత్రం ప్రమాదకరంగా రోడ్డు దాటాల్సిందే. ఇలాంటి సమయాల్లో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. రోడ్డు ప్రమాదాల బారిన పడినట్లే. ఇలా చాలా మంది యాక్సిడెంట్లకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో అధికారులు కీలక ప్రకటన చేశారు. మెట్రో స్టేషన్ నుంచి రోడ్డుకు ఒకవైపు నుంచి మరోవైపునకు చేరుకునేందుకు అవకాశం ఉందని చెప్పారు. కేవలం మెట్రో ప్రయాణికులే కాకుండా ఎవరైనా రోడ్డు దాటేందుకు దాన్ని ఉపయోగించుకోవచ్చునని తెలిపారు. వృద్ధులు, వికలాంగుల కోసం లిఫ్టు సౌకర్యం కూడా ఉంటుందని ఇబ్బందులు పడకుండా రోడ్డు దాటవచ్చునని తెలిపారు. ప్రస్తుతం ఉన్న మూడు కారిడార్లలోని మొత్తం 57 మెట్రో స్టేషన్లలో ప్రతి స్టేషన్‌లోనూ రోడ్డు దాటేందుకు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇక మెట్రో స్టేషన్ల నుంచి వాటి సమీపంలోని వాణిజ్య భవనాలు, నివాస సముదాయాలకు స్కైవాక్‌కు నిర్మించుకునేందుకు కూడా అనుమతి ఉందని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి వెల్లడించారు