తిరుమల కొండపై వీఐపీలకు వసతి గదుల కేటాయింపు విధానంలో టీటీడీ కొత్త రూల్ తీసుకువచ్చింది. ఇకపై వీఐపీలు దర్శన టికెట్ తీసుకుని వస్తేనే వారికి తిరుమలలో వసతి గదులు కేటాయించనున్నారు. టీటీడీ ఈ నిర్ణయం తీసుకోవడానికి గట్టి కారణమే ఉంది.
తిరుమల కొండపైకి వచ్చే యాత్రికులకు వసతి కల్పించేందుకు టీటీడీ 7,500 గదులను అందుబాటులో ఉంచింది. వీటిలో 3,500 గదులను సామాన్య భక్తులకు కేటాయిస్తారు. అడ్వాన్స్ బుకింగ్ కింద 1,580 గదులు, టీటీడీకి విరాళాలు ఇచ్చే భక్తులకోసం 400 గదులు, ఆన్ అరైవల్ కింద మరో 450 గదులు కేటాయిస్తున్నారు. మిగిలిన గదులను కరెంట్ బుకింగ్ విధానంలో వీఐపీల కోసం కేటాయిస్తున్నారు.
అయితే, వీఐపీలకు కేటాయించే ఈ గదులను దళారీలు ఆధార్ కార్డుల ద్వారా పొంది, వారి అధీనంలో ఉంచుకునేవారు. ఈ గదులను రెండ్రోజుల పాటు ఉపయోగించుకునే వీలుండడంతో… రోజుకు ఒక భక్తుడికి చొప్పున, లేకపోతే ఇద్దరు ముగ్గురు భక్తులకు కలిపి ఈ గదులను అద్దెకు ఇస్తూ దళారీలు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారు.
దాంతో దళారీ వ్యవస్థకు చెక్ పెట్టేందుకు టీటీడీ తాజా నిబంధన తీసుకువచ్చింది. ఇకపై దర్శన టికెట్ ఉన్న వీఐపీ వస్తేనే ఈ గదులు కేటాయిస్తారు. పద్మావతి విచారణ కేంద్రం, ఎంబీసీ, టీబీ కౌంటర్లలో ఆధార్ కార్డు, దర్శన టికెట్ ను చూపించి వీఐపీలు ఈ గదులు పొందాల్సి ఉంటుంది. ఈ విధానం ఎంతో మెరుగైన ఫలితాలు ఇస్తోందని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి.